మే 23 తర్వాత పెండింగ్ రైతు భరోసా .. ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

మే 23 తర్వాత పెండింగ్ రైతు భరోసా .. ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
  • ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల రైతులకు సాయం 
  • త్వరలోనే నాలుగు, ఆపైన ఉన్నవారికి ఇస్తామని క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 23వ తేదీ తర్వాత పెండింగ్ రైతు భరోసా డబ్బులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. గత నెల రోజులుగా రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల ఎమ్మెల్యేలకు సైతం ఈ విషయంలో నిరసన సెగ తగులుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్ జిల్లాల్లో రైతుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. తమకు పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందని రైతులు నేరుగా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. 

ఈ నేపథ్యంలో పలువురు శాసనసభ్యులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల పరిస్థితిని వివరించడంతో సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడున్నర ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా అందించామని.. మిగిలిన అర్హులైన రైతులకు, ముఖ్యంగా నాలుగు ఎకరాలు ఆపైన భూమి ఉన్నవారికి సైతం త్వరలోనే పెట్టుబడి సాయం జమ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఇప్పటివరకు 4 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ

గత ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచింది. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా సాయం పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది. దీంతో 4 ఎకరాలు ఆపైన భూమి ఉన్న రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 

ఇప్పుడు  రైతు భరోసా నిధుల కోసం ఆర్థిక శాఖ నిధులను సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమైంది. రాళ్లు, రప్పలు, సాగుకు యోగ్యం కాని భూములను మినహాయిస్తే రాష్ట్రంలో దాదాపు కోటి 50 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తిస్తుంది. దీనికోసం సుమారు రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం దాదాపు రూ.4 వేల కోట్ల వరకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన నిధులను విడతల వారీగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టి రైతులకు సాయం అందించాలని భావిస్తోంది.