
- ఆగస్ట్ 5 నుంచి అప్లికేషన్ల స్వీకరణ
- సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు యంత్ర పరికరాల పంపిణీ
పెద్దపల్లి, వెలుగు: వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఆగిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం తిరిగి ప్రారంభించనుంది. సబ్సిడీపై పరికరాలు అందించేందుకు ఆగస్ట్ 5 నుంచి మీసేవా ద్వారా అప్లికేషన్లు తీసుకోనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం పెద్దపల్లి జిల్లాకు రూ. 83 లక్షలు, కరీంనగర్ రూ.3.23 కోట్లు, జగిత్యాలకు రూ.3.11 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.74 లక్షలు కేటాయించారు. ఈ యేడు పూర్తిగా మహిళలకే అవకాశం ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారులను గ్రామ కమిటీల ద్వారా ఎంపిక చేస్తారు.
గ్రామ కమిటీల ద్వారా ఎంపిక
వ్యవసాయ యాంత్రీకరణ దేశవ్యాప్తంగా పెరిగిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ప్రారంభించిన సబ్సిడీ వ్యవసాయ యంత్రాల పంపిణీ స్కీంను 2018లో గత సర్కార్ నిలిపివేసింది. కానీ రైతుల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక నాటి సర్కార్ 2021–22లో బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. కానీ అది కాగితాలకే పరిమితమైంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయ్యాక వ్యవసాయంలో మెకనైజేషన్ తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు కేటాయించారు.
ఈ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యంత్రాలను మహిళల పేరిట అందజేయనున్నారు. అర్హులైన మహిళలు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు. అనంతరం గ్రామ కమిటీలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన మహిళలకు 40 నుంచి 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. పెద్ద ట్రాక్టర్లు, చిన్న ట్రాక్టర్లు, బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, డ్రోన్లు, రోటోవేటర్, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, కల్టీవేటర్, బండ్ఫార్మర్, పవర్ వీడర్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్, స్ట్రా బాలర్స్.. వంటి యంత్రాలను సబ్సిడీపై అందజేయనున్నారు.