
- టీమ్‌లో డీఎఫ్ఓ, రేంజ్, బీట్ ఆఫీసర్, వాచర్లు
- జంతువుల రాకపోకలపై 242 ట్రాకర్ల ద్వారా నిఘా
- వన్యప్రాణులు, పక్షుల దప్పిక తీర్చేందుకు 449 సోలార్ బోర్ వెల్స్
- అందుబాటులో 2,168 నీటి సాసర్లు
హైదరాబాద్, వెలుగు: అడవి జంతువుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వేసవిలో వాటి దాహార్తి తీర్చడంతోపాటు వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 150 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ), రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లతో పాటు వాచర్లు ఈ బృందాల్లో ఉంటారు. వన్యప్రాణుల రక్షణ, వేటగాళ్ల కదకలికలపై ఈ బృందాలు స్పెషల్ ఫోకస్ పెడతాయి. ఈ బృందాలు రాత్రిపూట అడవుల్లో వేటను అరికట్టడంతోపాటు జంతువుల సంరక్షణపై ప్రజలను చైతన్యం చేస్తాయి.
అడవిలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాయి. జంతువుల ఆవాసాలపై నిఘా పెట్టి వాటి రాకపోకలను గమనిస్తుంటాయి. వన్యప్రాణలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఆహారం కోసం ఎక్కడికి వెళ్తున్నాయి, ఇతర అటవీ ప్రాంతాల నుంచి ఏమైనా వన్యప్రాణులు రాకపోకలు సాగిస్తున్నాయా, వేటగాళ్లు అడవిలో సంచరిస్తున్నారా అన్న విషయాలపై స్పెషల్ టీమ్స్ దృష్టి పెడతాయి. జంతువులకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటాయి. డీఎఫ్ఓల పర్యవేక్షణలో ఈ బృందాలు పనిచేస్తాయి.
సోలార్ బోర్‌వెల్స్ తో దాహార్తికి చెక్
రాష్ట్రంలో సుమారు 27,688 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. ఇందులో ఎక్కువ భాగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4,311.38 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. తర్వాత ములుగు జిల్లాలో 71.81 శాతం అటవీ విస్తీర్ణంలో అడవులున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో తక్కువ అటవీ విస్తీర్ణం ఉంది. అయితే, వేసవిలో వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సోలార్ బోర్ వెల్స్‌ను ఏర్పాటు చేశారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో విద్యుత్, రవాణా సౌకర్యాలు ఉండవు.
అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అనుమతి లేకపోవడంతో సోలార్ బోర్ వెల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 449 సోలార్ బోర్ వెల్స్ మంజూరు చేయగా.. ఒక్కొక్క సోలార్ బోర్స్వెల్ కు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చుచేశారు. కాగా, గతంలో అడవిలో జంతువులకు నీరందకపోవడంతో అవి జనావాసాల్లోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడేవి. వేటగాళ్ల ఉచ్చుకు బలైయ్యేవి. సోలార్ బోర్ వెల్స్ ఏర్పాటుతో వన్యప్రాణుల తాగునీటి సమస్యకు చెక్ పడింది. అడవుల్లో 2,168 నీటి సాసర్స్ నిర్మించగా.. వీటిల్లో సోలార్ బోర్లతో రోజూ నీరు నింపుతున్నారు. సాసర్స్తో పక్షులు, జంతువులు దప్పిక తీర్చుకుంటున్నాయి. వీటికితోడు 1,500 పైగా చెరువులు, కుంటలను ఏర్పాటు చేయగా.. ట్రాకర్ల ట్యాంకర్లతో నీరు నింపుతున్నారు.
జంతువుల జాడ పసిగట్టేందుకు ట్రాకర్లు
అడవిలో వన్యప్రాణుల వేటను అరికట్టడం, జంతువులకు నీటి వసతి కల్పించడం, వాటి సంచారాన్ని గమనించడం ద్వారా అటవీ జీవవైవిధ్యాన్ని కాపాడేలా అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. జంతువుల రాకపోకలను పసిగట్టేందుకు 242 ట్రాకర్లను అడవిలో అమర్చింది. ఈ ట్రాకర్లు జంతువుల కదలికలను రికార్డు చేస్తూ అధికారులకు సమాచారాన్ని అందిస్తాయి. ఒక్కసారి జంతువుల జాడ తెలిస్తే వాటి భద్రత కోసం తదుపరి చర్యలు తీసుకోవడం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు.
వేటగాళ్ల కదలికలతోపాటు జంతువులు గ్రామాల్లోకి రాకుండా నిరోధించవచ్చని, ప్రస్తుతం ఉన్న ట్రాకర్లు సరిపోవని, ఇంకా అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. జీవవైవిధ్య హాట్‌స్పాట్లలో ట్రాకర్ల సంఖ్యను పెంచాలని, డేటా విశ్లేషణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. అలాగే, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు ‘క్యాచ్ ద ట్రాప్’ పేరుతో తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వేటగాళ్ల ఉచ్చులు, కరెంట్ షాక్ నుంచి జంతువులను సంరక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వన్యప్రాణుల కోసం అమర్చిన 2,500 కిలోల మెటీరియల్(కరెంటు తీగలు, ఉచ్చులు, వలలు) ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.