కాకతీయ మెగా టెక్స్టైల్‍ పార్కు రైతులకు..  రెడీమేడ్‍ ఇందిరమ్మ ఇండ్లు!

కాకతీయ మెగా టెక్స్టైల్‍ పార్కు రైతులకు..  రెడీమేడ్‍ ఇందిరమ్మ ఇండ్లు!
  • భూకంపాలు తట్టుకునేలా తక్కువ టైమ్​లో నిర్మాణం
  • 863 మందికి ఇండ్లు నిర్మించేలా అధికారుల చర్యలు
  • త్వరలో పార్క్  ప్రారంభం, అద్దె ఇండ్లకు పెరగనున్న డిమాండ్‍ 
  • నేడో రేపో కంపెనీ ప్రతినిధులు, రైతులతో సమావేశం  

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్  నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రెడీమేడ్‍ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు జిల్లా ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారు. వరంగల్‍ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో పార్క్  నిర్మాణం కోసం దాదాపు 1,250 ఎకరాల భూములు సేకరించగా.. 863 మంది భూనిర్వాసిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పార్క్  దగ్గర్లోనే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించింది. 

స్థానికులకు ఉద్యోగాలు, డబుల్‍ ఇండ్లు రాలే

కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్  ఏర్పాటు కోసం కేసీఆర్‍ ప్రభుత్వం 1,270 ఎకరాల భూమి సేకరించింది. రెండేళ్లలో ఇంటికో ఉద్యోగం ఇవ్వడానికి తోడు బాధిత రైతులకు పార్క్  దగ్గరే డబుల్‍ బెడ్‍రూం ఇండ్లు కట్టిస్తామని మాటిచ్చారు. 2017లో పార్క్  పనులకు శంకుస్థాపన జరగగా, 2023లో కేసీఆర్‍ గవర్నమెంట్‍ దిగిపోయేంత వరకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.

దీంతో రైతులు పలుమార్లు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. కోట్లాది విలువ చేసే భూములను రూ.10 లక్షలకు ఎకరం చొప్పున బలవంతంగా గుంజుకొని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్‍ ప్రభుత్వం స్థానికులకు ఉద్యోగ భరోసాతో పాటు రైతులకు ప్రత్యేక విలేజ్‍ డెవలప్‍ చేసేందుకు ముందుకొచ్చింది. 

భూనిర్వాసితుల కోసం కొత్త విలేజ్..

వరంగల్‍ కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్  ప్రారంభించే సమయానికి భూనిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్‍రెడ్డి ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నాతాధికారులు రైతుల కోసం రాజీవ్‍గాంధీ టౌన్‍షిప్‍ పేరుతో కొత్త ఊరు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రూ.10.10 కోట్లతో మొదటి దశ మౌలిక వసతులకు శ్రీకారం చుట్టారు. అంతర్గత రోడ్లు, మంచినీటి వ్యవస్థ, డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్‍ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇవేగాక ప్రైమరీ స్కూల్‍, పీహెచ్‍సీ, కమ్యూనిటీ హాల్‍ నిర్మాణానికి ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో కొత్త గ్రామపంచాయతీగా అభివృద్ధి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.

రైతులు ఆర్థికంగా ఎదిగేలా..

కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్క్  నిర్మాణ పనులు 9 ఏండ్లుగా నడుస్తుండగా.. గణేశా ఎకో, యంగ్వన్‍ కంపెనీల ద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కలేదు. కాగా, పిల్లల దుస్తుల తయారీలో పేరున్న కైటెక్స్  కంపెనీ రాబోయే మూడు. నాలుగు నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రయల్‍ వర్క్స్  నడుస్తున్నాయి. ఈ కంపెనీ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. కాగా, అదే సమయానికి పార్క్  కోసం భూములిచ్చిన రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా రాష్ట్ర సర్కారు రెడీమేడ్‍ ఇండ్ల నిర్మించాలనే ఆలోచన చేసింది. 

ఇప్పటికే 863 మందికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన నేపథ్యంలో.. తక్కువ సమయంలో రెడీమేడ్‍ ఇండ్ల నిర్మాణం జరిగేలా అడుగులు వేస్తోంది. భూకంపాలను తట్టుకునే స్థాయిలో వీటి నిర్మాణం ఉంటుందని చెబుతున్నారు. టెక్స్​టైల్‍ పార్క్  ప్రారంభమైతే అందులోని వేలాది మందికి అందుబాటులో అద్దె ఇండ్లు అవసరం ఉండనుంది. 

ఆ సమాయానికి రైతులకు కేటాయించిన ఇందిరమ్మ రెడీమేడ్‍ ఇండ్లు చేతికొస్తే.. కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు అద్దెకు ఇవ్వడం ద్వారా రైతులకు భవిష్యత్తులో ఆర్థికంగా మేలు చేసే దిశగా ఆలోచన చేశారు. నేడోరేపో ఇండ్ల నిర్మాణ కంపెనీ ప్రతినిధులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా రెడీమేడ్‍ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.