గుడ్ న్యూస్:  ఉద్యోగులకు  రెండు డీఏలు... దసరా కానుకగా రెండూ కలిపి 6.4 శాతం ఇచ్చేందుకు సర్కారు ఓకే..

గుడ్ న్యూస్:  ఉద్యోగులకు  రెండు డీఏలు... దసరా కానుకగా రెండూ కలిపి 6.4 శాతం ఇచ్చేందుకు సర్కారు ఓకే..
  • సీపీఎస్‌‌ పై అధ్యయనానికి కమిటీ
  • త్వరలో పీఆర్సీ నివేదిక, అమలు
  • కేబినెట్ ముందుకు డీఏల ఫైల్
  • డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్‌‌తో ఉద్యోగుల జేఏసీ చర్చలు సఫలం
  • నేటి సమావేశం వాయిదా: మారం జగదీశ్వర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారుతో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చర్చలు ఫలించాయి. చాలాకాలంగా పెండింగ్‌‌లో ఉన్న కరవు భత్యం (డీఏ) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగుల డిమాండ్లపై చర్చించిన అనంతరం రెండు డీఏలకు అంగీకారం తెలిపింది.  బుధవారం డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌‌)తో జరిగిన సమావేశంలో ఉద్యోగుల నాలుగు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం కీలక హామీలు ఇచ్చింది. 

దసరా పండుగ కానుకగా ఒకేసారి రెండు డీఏలను చెల్లించేందుకు అక్టోబర్ ఒకటిన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తెలుపుతామని పేర్కొన్నది. రెండు డీఏల్లో ఒకటి 3.64%,  మరొకటి 2.73% మొత్తం విలువ  6.4 శాతం వరకు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ నెలాఖరు నాటికి వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) నివేదికను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని తెలిపింది. 

సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుపై 3 నెలల కాలపరిమితితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించిన నేపథ్యంలో హైదరాబాద్‌‌లో గురువారం జరగాల్సిన జేఏసీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని, ఉద్యోగులు ఎవరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు.

సెక్రటేరియెట్‌‌లో సీఎస్‌‌తో భేటీ

బుధవారం తొలుత సెక్రటేరియెట్‌‌లో సీఎస్​ సంజయ్‌‌ జాజుతో ఉద్యోగుల జేఏసీ  నేతలు వి.లచ్చిరెడ్డి, మారం జగదీశ్వర్​,  వొడ్నాల రాజశేఖర్,  ఏలూరి శ్రీనివాసరావు ప్రతినిధి బృందం భేటీ అయింది. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, తక్షణమే ప్రభుత్వం చొరవ చూపి పరిష్కరించాలని నేతలు కోరారు. 

ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సీఎస్.. తక్షణమే రెండు డీఏల విడుదలకు ఆమోదం తెలపడంతోపాటు సీపీఎస్ రద్దు అంశంపై   ప్రత్యేక కమిటీ వేస్తామని తెలిపారు. ఉద్యోగుల సర్వీసు సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా లేదంటే రెండు నెలలకోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.  
 
ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న జీవో 317, 190 బాధితుల కేసులను వెంటనే పరిష్కరించాలని, అర్హులందరికీ న్యాయం చేయాలని సీఎస్‌కు జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల నాలుగేండ్ల సర్వీసును సర్వీస్ బెనిఫిట్స్, సీనియారిటీ కోసం పరిగణనలోకి తీసుకోవాలని, ఔట్‌సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలను గ్రేడ్-4గా రెగ్యులరైజ్ చేయాలని కోరారు. రెవెన్యూ శాఖలో 20 ఏండ్లుగా పనిచేస్తున్న 632 మంది కంప్యూటర్ ఆపరేటర్లను, సీసీఎల్‌ఏ సిబ్బందిని కొనసాగించడమో లేదా జీపీవోలుగా తీసుకోవడమో చేయాలని విజ్ఞప్తి చేశారు. 

జీవో 81 ప్రకారం పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏలకు జీపీవోలుగా ఒకేసారి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో ఉమ్మడి సర్వీస్ నిబంధనలు అమలు చేసి.. పదోన్నతులు ఇవ్వాలని, జీవో 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలకు పీఎస్‌ హెచ్‌ఎం పోస్టు ఇవ్వాలని కోరారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలని, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ వేతన వ్యత్యాసాన్ని పీఆర్‌సీలో తగ్గించాలని, గురుకుల టీచర్లకు 010 హెడ్ ద్వారా జీతాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని, సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విన్నవించారు.  

జీపీఎఫ్, జీఐఎస్, ఈఎల్ లీవ్ సాలరీ తదితర ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ఈ-–కుబేర్ ద్వారా అదనపు నిధులు కేటాయించి 3 నెలల్లో చెల్లించాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.  ఫ్యూచర్ సిటీలో, జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల గృహ నిర్మాణానికి భూములు కేటాయించాలని, నగదురహిత మెడికల్ హెల్త్ స్కీమ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. మొత్తం 69 సమస్యల పరిష్కారానికి క్రమం తప్పకుండా ప్రతి నెలా లేదా రెండు నెలలకోసారి ‘జాయింట్ స్టాఫ్ కౌన్సిల్’ భేటీలు నిర్వహించేందుకు సీఎస్ అంగీకరించారని జేఏసీ నేతలు పేర్కొన్నారు.

రెండో పీఆర్సీపై నివేదిక: లచ్చిరెడ్డి

కనీసం మూడు డీఏలను ఒకేసారి ఇవ్వాలని తమ జేఏసీ కోరగా.. రెండు డీఏలను మంజూరు చేయడానికి సీఎస్ అంగీకరించారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ డీఏల చెల్లింపు ప్రతిపాదనను త్వరలోనే  కేబినెట్‌ ముందుకు తీసుకెళ్లి.. ఆమోదింపజేస్తామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు.  రెండో పీఆర్సీపై  స్వయంగా పీఆర్సీ చైర్మన్‌తో మాట్లాడినట్టు సీఎస్​ చెప్పారని, వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సూచించినట్టు వివరించారు.