- 44 వేల మందికి కార్డులు వచ్చే చాన్స్
- సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రెడిటేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నదని పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కార్డుల జారీ విధానం, అక్రెడిటేషన్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, సీఎం సీపీఆర్వో మల్సూర్ తో మంత్రి చర్చించారు.
ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. అక్రెడిటేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ముందుగా జీవో 252 జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాలతో సమావేశమై అవసరమైన సవరణలు చేసి జీవో 103ను జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
కార్డుల జారీ నిరంతర ప్రక్రియ..
ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. గతంలో సుమారు 23 వేల మందికి మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 21 వేలకు పైగా కార్డుల సంఖ్య పెరుగుతుందని మంత్రి వివరించారు.
2.50 లక్షల పైగా సర్క్యులేషన్ ఉన్న ఎనిమిది పత్రికలకు 6,256 కార్డులు, 75 వేల నుంచి 2.50 లక్షల వరకు సర్క్యులేషన్ ఉన్న24 పత్రికలకు 17,784 కార్డులు, 25001 నుంచి 75 వేల వరకు సర్క్యులేషన్ ఉన్న 30 పత్రికలకు 3,390, అదేవిధంగా 15001 నుంచి 25000 వరకు సర్క్యులేషన్ ఉన్న 169 చిన్న పత్రికలకు 11,661 , 15వేలలోపు సర్క్యులేషన్ ఉన్న 113 చిన్న పత్రికలకు 226, పీరియాడికల్స్‌కు 624, 20 న్యూస్ ఏజన్సీలకు 68 అక్రెడిటేషన్‌లు పొందుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అలాగే 21 శాటిలైట్ చానెళ్లకు 4,431 కార్డులు, ఎనిమిది జాతీయ చానెళ్లకు 32, వంద లోకల్ కేబుల్ చానెళ్లకు 200, డిజిటల్ మీడియా విభాగానికి 10 కార్డులు మొత్తంగా 44,706 కార్డులు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర, జిల్లా స్థాయిలో 16,056, నియోజకవర్గ, మండల స్థాయిలో 28,650 మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అక్రెడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అవసరాన్ని బట్టి మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
