కండ్లు మూసినా.. మెడ తిప్పినా అలారం మోగుతది: ఆర్టీసీ బస్సుల్లో ఏఐ టెక్నాలజీ

కండ్లు మూసినా.. మెడ తిప్పినా అలారం మోగుతది: ఆర్టీసీ బస్సుల్లో ఏఐ టెక్నాలజీ
  • ప్రమాదాల నివారణకు ఆర్టీసీ బస్సుల్లో ఏఐ టెక్నాలజీ
  • హైదరాబాద్ ఐఐటీ సహకారంతో పైలెట్ ప్రాజెక్టు అమలు
  • డ్రైవర్ 2 సెకన్లు కండ్లు మూసినా..  సెల్​ఫోన్ వాడినా అలర్ట్​ చేస్తది
  • లాంగ్ రూట్​లో నడిచే బస్సుల్లో డీఎంఎస్ టెక్నాలజీ అమలు
  • ఒక్కో డివైజ్ కోసం లక్ష రూపాయలు ఖర్చు

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సేవలు అందించేందుకు ఆర్టీసీ అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగిస్తున్నారు. డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ (డీఎంఎస్) టెక్నాలజీకి.. ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్ల సహకారంతో ఏఐని జోడించి ఆర్టీసీ బస్సులను ప్రమాదాల బారినపడకుండా ఉండేలా కొన్ని రోజులుగా పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. దీని కోసం లాంగ్ రూట్​లలో నడిచే బస్సులను అధికారులు ఎంపిక చేశారు. డ్రైవర్ 2 సెకన్ల పాటు కండ్లు మూసినా, 3 సెకన్ల పాటు మెడ పక్కకు తిప్పినా,  ఫోన్ వాడినా, వెనుక ఉన్న వెహికల్ దగ్గరగా వచ్చినా, ముందున్న వెహికల్​కు బస్సు దగ్గరదాకా వెళ్లినా.. అలారం మోగి డ్రైవర్​ను అలర్ట్ చేస్తుంది. 

హైవేలపై బస్సు ఒక లైన్ నుంచి మరో లైన్ క్రాస్ చేసినా డ్రైవర్​ను అప్రమత్తం చేస్తుంది. బ్లాక్ స్పాట్ (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు)ల వద్దకు బస్సు చేరుకోగానే.. ఈ అలారం మోగి డ్రైవర్ ను అలర్ట్ చేస్తుంది. డీఎంఎస్ టెక్నాలజీలో భాగంగా బస్సు అద్దానికి కెమెరాతో కూడిన ఓ డివైజ్ అమర్చుతారు. దీంతో డ్రైవర్ కదలికలతో పాటు బస్సుకు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలను ఇది నిశితంగా పరిశీలిస్తుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా.. వెంటనే అలారం మోగుతుంది.

ఆర్టీసీపై రూ.18 కోట్ల భారం

లాంగ్ రూట్ లో నడిచే కొన్ని బస్సులకు కొన్ని రోజుల పాటు ఈ డివైజ్ ను అమర్చి పైలెట్ ప్రాజెక్టు కింద దీన్ని అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయి. ఈ డివైజ్ అమర్చిన బస్సులు ఎలాంటి ప్రమాదాలకు గురికాలేదు. ఇక అన్ని బస్సుల్లో ఈ డివైజ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబై, షిరిడీ, నాగ్‌పూర్, నాందేడ్, చంద్రపూర్, వైజాగ్, తిరుపతి, కడప, నెల్లూరు, మచిలీపట్నం, ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ రూట్లలో నడిచే ఏసీ బస్సులకు (లహరి, రాజధాని, గరుడ, గరుడ ప్లస్) ఈ డివైజ్ అమర్చుతారు. 

ఒక్కో డివైజ్ కు సుమారు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు, మన రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు లాంగ్ రూట్లలో నడిచే బస్సులు సుమారు 1,800 వరకు ఉన్నాయి. వీటన్నింటికి ఈ డివైజ్​ను అమర్చాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ఆర్టీసీపై అదనంగా రూ.18 కోట్ల భారం పడనున్నది.