Women's ODI World Cup 2025: సొంతగడ్డపై తీవ్ర ఒత్తిడిలో టీమిండియా.. సెమీస్‌కు వెళ్లాలంటే ఇలా జరగాలి!

Women's ODI World Cup 2025: సొంతగడ్డపై తీవ్ర ఒత్తిడిలో టీమిండియా.. సెమీస్‌కు వెళ్లాలంటే ఇలా జరగాలి!

సొంతగడ్డపై వరల్డ్ కప్ జరుగుతుంటే ఈ సారి భారత మహిళల జట్టు ఖచ్చితంగా వరల్డ్ కప్ టైటిల్ కొడుతుందని ఫ్యాన్స్  భావించారు.  హర్మన్ ప్రీత్ కౌర్ లోని భారత జట్టు టోర్నీకి ముందు పటిష్టంగా కనిపించడంతో కనీసం ఫైనల్ బెర్త్ కన్ఫర్మా అనుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే 2025 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ కు వెళ్లే సెమీ ఫైనల్ కు వెళ్లడం కూడా కష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వరుస విజయాలతో దూసుకెళ్తుంటే ఇండియా మాత్రం ఓటములతో ఢీలా పడుతుంది. 

తొలి మ్యాచ్ లో శ్రీలంకపై గెలిచి బోణీ కొట్టిన కౌర్ సేన.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారీ విజయం సాధించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత రెండు పరాజయాలు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాయి. సౌతాఫ్రికాపై గెలిచే మ్యాచ్ లో ఓడిన మన జట్టు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై భారీ స్కోర్ చేసి పరాజయం పాలయ్యారు. ఓవరాల్ గా నాలుగు మ్యాచ్ ల్లో రెండు గెలిచి.. మరో రెండు ఓడింది. సెమీస్ కు అర్హత సాధించాలంటే మిగిలిన మూడు మ్యాచ్ ల్లో రెండు గెలవాలి. టీమిండియా మహిళల జట్టు తమ తదుపరి మ్యాచ్ ఆదివారం (అక్టోబర్ 19) ఇంగ్లాండ్ తో ఆడనుంది.

ప్రస్తుతం టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచి సూపర్ ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఓడించాలంటే టీమిండియా శ్రమిమించక తప్పదు. ఆ తర్వాత న్యూజిలాండ్ రూపంలోనూ కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడాల్సి ఉంది. మిగిలిన మూడు మ్యాచ్ ల్లో గెలిస్తే ఎలాంటి సమీకరణలతో పని లేకుండా రాయల్ గా సెమీస్ లోకి అడుగుపెట్టవచ్చు. రన్ రేట్ ఎక్కువగా ఉన్న కారణంగా రెండు మ్యాచ్ ల్లో గెలిచినా సెమీస్ బెర్త్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఒకటే మ్యాచ్ లో గెలిస్తే ఇంటిదారి పట్టనుంది. ఇలాంటి తీవ్ర ఒత్తిడిలో మన మహిళల జట్టు ఎలా ఆడుతుందో ఆసక్తికరంగా మారింది. 

ఈ సారైనా సాధిస్తారా..?
  
47 ఏళ్ళ మహిళల వన్డే చరిత్రలో భారత క్రికెట్ జట్టు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేకపోయింది. 2005, 2017  వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వచ్చినా తుది మెట్టుపై బోల్తా పడింది. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో వరల్డ్ కప్ జరగనుండడంతో ఫ్యాన్స్ ఈ సారి మన మహిళల జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న జట్టుతో వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ వరుసగా రెండు పరాజయాల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌గా ఇండియా ఫేవరెట్‌‌‌‌ అయితే.. డిఫెండింగ్ చాంప్ హోదాలో ఎనిమిదో టైటిల్ కోసం బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా మరోసారి హాట్ ఫేవరెట్‌‌‌‌గా ఉంది. 

సెమీస్ కు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా: 

మహిళల వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు తిరుగులేకుండా దూసుకెళ్తుంది. గురువారం (అక్టోబర్ 16) బంగ్లాదేశ్ ను చిత్తుచిత్తుగా ఓడించి సెమీస్ కు అర్హత సాధించింది. మొత్తం 8 జట్లు రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో ఆడుతున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా సెమీస్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో కంగారూలు నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. శ్రీలంకపై జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఫలితం రాలేదు. ప్రస్తుతం 9 పాయింట్లతో టాప్ లో ఉంది.