ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్​కు లేదు : మంత్రి తుమ్మల

ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బీఆర్ఎస్​కు లేదు : మంత్రి తుమ్మల
  •  ఒకేసారి రూ.20వేల కోట్ల రుణమాఫీ చేసినం: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: రుణమాఫీలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రుణమాఫీ అమలు చేయలేక చేతులెత్తేసిన బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని ఓ ప్రకటనలో మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు దేశ చరిత్రలో ఎవరూ చేయనివిధంగా ఏకకాలంలో రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేశామని పేర్కొన్నారు. 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616 కోట్ల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. 

కుటుంబ వివరాలు సరిగా లేకపోవడంతో రుణమాఫీ కాని 3.13 లక్షల మంది రైతుల ఇండ్లకు వెళ్లి రూ.2,747 కోట్ల రుణం మాఫీ చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎంతో ఇబ్బందిపడ్డారని తెలిపారు. 2014లో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేయడంతో రైతులపై రూ.2,630 కోట్ల వడ్డీ భారం పడిందని పేర్కొన్నారు. సగం మంది రైతుల ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని తెలిపారు.

 రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, యాంత్రీకరణ, మైక్రో ఇరిగేషన్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వరి వేస్తే ఉరి, మొక్కజొన్న వద్దు, పత్తి సాగు చేయొద్దంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. ఒక్కో సీజన్​లో.. ఒక్కో మాట చెప్తూ రైతులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు.