
హైదరాబాద్, వెలుగు: క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, నేషనల్ స్పోర్ట్స్ డే లో భాగంగా శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడా శాఖ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డితో కలిసి ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ధ్యాన్ చంద్ సాధించిన మూడు ఒలింపిక్ స్వర్ణ పతకాలను స్ఫూర్తిగా తీసుకుని, రాష్ట్ర క్రీడాకారులు కూడా ఒలింపిక్ మెడల్స్ నెగ్గాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన క్రీడా విధానం క్రీడాకారులకు గొప్ప అవకాశాలను అందిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత గొప్పగా తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలను నిర్వహించామని శివసేన రెడ్డి తెలిపారు.
ఒకే ఏడాదిలో అనేక క్రీడా పోటీలతో పాటు కార్యక్రమాలు నిర్వహించి, స్పోర్ట్స్ పాలసీ ప్రకటించినందుకు ప్రముఖ క్రీడాకారులు తెలంగాణను అభినందిస్తున్నారని అన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో పతకాలు సాధించిన 41 మంది క్రీడాకారులకు మొత్తం రూ.1.29 కోట్ల ప్రోత్సాహకాలను మంత్రి అందజేశారు.
వరల్డ్ యూత్ ఆర్చరీ గోల్డ్ మెడలిస్ట్ తానిపర్తి చికిత, పవర్ లిఫ్టర్లు శృతి , తుడి శ్రీ చందన, ఇండియా క్రికెట్ టీమ్ ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కు రూ. 5 లక్షల చొప్పున నగదు లభించింది. షూటర్ ఇషా సింగ్, రోలర్ స్కేటర్లు సౌరవ్ సింగ్, ఆర్. కావ్య శ్రీ తదితరులు రూ. 4 లక్షల చొప్పున అందుకున్నారు.. ఇక క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న కోచ్‌లకు ఆర్థికంగా అండగా ఉండే ఉద్దేశంతో 'గురు వందనం' బీమా పథకాన్ని మంత్రి ప్రారంభించారు.