మునుగోడు బై పోల్ పై ప్రచారం.. పాత హామీలకు మోక్షం

మునుగోడు బై పోల్ పై ప్రచారం.. పాత హామీలకు మోక్షం
  • ఉప ఎన్నిక వస్తుందన్న ప్రచారంతో సర్కార్​ హడావుడి
  • సాగర్ బై పోల్​ టైంలో ప్రకటించిన ఫండ్స్​కు ఇప్పుడు గ్రీన్​సిగ్నల్​
  • 157 పంచాయతీలకు 20 లక్షల చొప్పున, 
  • ఆరు మండలాలకు 30 లక్షల చొప్పున రూ. 33.20 కోట్లు 
  • అభివృద్ధి పనులకు ప్రపోజల్స్ పంపాలని ఆదేశాలు
  • ఇటీవలే మండలంగా గట్టుప్పల్​ ప్రకటన
  • తెరపైకి చండూరు రెవెన్యూ డివిజన్ డిమాండ్​

త్వరలో చౌటుప్పల్ 
మున్సిపాలిటీకి ​కూడా..
మునుగోడు నియోజకవర్గంలోని 
చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ. 50 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటనలో ప్రకటించారు. కానీ, ఈ నిధుల ప్రొసీడింగ్స్ ఇప్పటికీ రాలేదని అధికారులు చెప్తున్నారు. ఇవే కాకుండా అర్బన్ డెవలప్​మెంట్​ కింద మున్సిపాలిటీకి రూ.20 కోట్లు కేటాయిస్తామని గతంలో మంత్రి కేటీఆర్ కూడా హామీ ఇచ్చారు. వార్డుల్లో సమస్యలు గుర్తించి, పనుల అంచనాలను అధికారులు ఎప్పుడో సిద్ధం చేశారు. మునుగోడు బై ఎలక్షన్ వార్తల నేపథ్యంలో ఈ హామీలకు కూడా త్వరలో మోక్షం కలుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. 

నల్గొండ, వెలుగు :  మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందన్న ప్రచారం ఊపందుకోవడంతో పాత హామీలు, పెండింగ్ పనులను రాష్ట్ర సర్కారు ముందటేసుకుంటున్నది. ఇన్నాళ్లూ ఎన్ని వినతులు ఇచ్చినా, రోడ్లెక్కి రాస్తారోకోలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు ఒకటొకటిగా హామీలు అమలు చేయడం మొదలుపెట్టింది. నాగార్జున సాగర్​ ఉప ఎన్నిక టైమ్​లో చెప్పిన స్పెషల్​ డెవలప్​మెంట్ ఫండ్స్​ను తాజాగా మునుగోడు నియోజకవర్గంలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షలు, మండల కేంద్రానికి రూ. 30 లక్షలు ఇస్తామని సాగర్​ బై పోల్​ సందర్భంగా సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూ.168.80 కోట్లు, 31 మండలాలకు రూ.9.30 కోట్లు కేటాయిస్తున్నట్లు నిరుడు జూన్ 11న జీవో నంబర్​232 రిలీజ్ చేశారు. అయితే జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ఐదు నియోజకవర్గాల్లో నిధులు ఇచ్చినా.. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న మునుగోడు నియోజకవర్గానికి మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో అక్కడ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు వర్క్​ ఆర్డర్లు తీసుకుంటున్నది. ఆర్డర్లు రాగానే.. నిధులు విడుదల చేయనుంది. ఇటీవల జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని టీఆర్​ఎస్​కు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను పిలిచి.. త్వరగా నివేదికలు పంపాలన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో.. 

మునుగోడు నియోజకవర్గంలోని 157 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున, ఆరు మండల కేంద్రాలకు రూ. 30 లక్షల చొప్పున మొత్తం రూ. 33.20 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ప్రతిపక్ష పార్టీల స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్న చోట్ల టీఆర్​ఎస్​కు చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు, మండల ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు నిధులివ్వాలని ఇటీవల సూర్యాపేటలో మంత్రి జగదీశ్​రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్​లో తీర్మానించారు. మునుగోడు, నాంపల్లి, చండూరు మండలాల్లో  అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఉన్నప్పటికీ.. వారికి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మధ్య విభేదాల కారణంగా ప్రపోజల్స్ ఇవ్వలేదు. దీన్ని సీరియస్​గా తీసుకున్న మంత్రి గత శుక్రవారం హైదరాబాద్​లో కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి ఇంట్లో మీటింగ్​పెట్టి ప్రపోజల్స్ గురించి చర్చించారు. ఈ సమావేశానికి నాంపల్లి, మునుగోడు జడ్పీటీసీలు హాజరు కాలేదు. దీంతో ఆ ఇద్దరితో మరోసారి చర్చించి, ప్రపోజల్స్ త్వరగా తీసుకోవాలని మంత్రి నిర్ణయించారు. ఇన్నాళ్లూ తమను పట్టించుకోని మంత్రి.. బై ఎలక్షన్​ ప్రచారం నేపథ్యంలో పిలిచి మరీ ఫండ్స్ ఇస్తుండడంతో స్థానిక ప్రజాప్రతినిధులు సంబురపడ్తున్నారు. మరోవైపు మంత్రి తీరుపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు భగ్గుమంటున్నారు. తమ గ్రామాలు, మండలాలకు ఇచ్చే ఫండ్స్​పై టీఆర్​ఎస్​లీడర్ల పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం తమ నుంచే ప్రపోజల్స్​ తీసుకోవాలని, లేదంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు.

తెరపైకి చండూరు రెవెన్యూ డివిజన్ 

మునుగోడు బై ఎలక్షన్​ ప్రచారం వల్ల పాత డిమాండ్లన్నీ తెరపైకి వస్తున్నాయి. ఎప్పటి నుంచో వినిపిస్తున్న గట్టుప్పల్ మండల డిమాండ్ కు ఇటీవల రాష్ట్ర సర్కారు ఓకే చెప్పింది. ఇప్పుడు కొత్తగా చండూరు రెవెన్యూ డివిజన్ చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్ కలిపి చౌటుప్పల్ డివిజన్ కేంద్రంగా ఉంది. నాంపల్లి, మర్రిగూడ మండలాలు దేవరకొండ డివిజన్ పరిధిలో.. చండూరు, మునుగోడు మండలాలు నల్గొండ డివిజన్ పరిధిలో ఉన్నాయి. చండూరు మున్సిపాలిటీ కాబట్టి దాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారిస్తే పరిపాలన సౌలభ్యం ఉంటుందని టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. డివిజన్ కేంద్రమైతే కోర్టు, వంద పడకల దవాఖాన, ఫైర్ స్టేషన్ వంటి అనేక వసతులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్తున్నారు. ఈ డిమాండ్​ను ​జడ్పీటీసీ మెంబర్​ కర్నాటి వెంకటేశం బలంగా వినిపిస్తున్నారు. మంత్రి జగదీశ్​రెడ్డి ద్వారా ఈ అంశాన్ని  సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మునుగోడు, చండూరు లీడర్లకు ఆయన మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లూ పట్టించుకోలే..

సాగర్ బైపోల్స్​ టైంలో ప్రకటించిన స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్స్​ను నల్గొండ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల మాదిరిగానే తన నియోజకవర్గానికి ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఎప్పటినుంచో కోరుతున్నారు. పలుమార్లు నల్గొండ జిల్లా కలెక్టర్​ను, హైదరాబాద్​లోని పంచాయతీ, మున్సిపల్​కమిషనర్లను కలిసి ఫండ్స్​కోసం విజ్ఞప్తి చేశారు. ఈ అంశం మంత్రి జగదీశ్​రెడ్డి పరిధిలో ఉన్నందున తామేమీ చేయలేమని తనతో కలెక్టర్​ చెప్పినట్లు రాజగోపాల్​రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్స్​ కోసం సీఎం అపాయింట్​మెంట్​ను కోరినా  ఫలితం లేదన్నారు. ఇన్నాళ్లూ పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు వర్క్​ ప్రపోజల్స్​ పంపాలని స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్తున్నది.