
సిద్దిపేట/కోహెడ, వెలుగు : ‘సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే చిన్నది కాదు.. అదొక విప్లవం, భారత మహిళా శక్తికి నిదర్శనం’ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇందిర మహిళా శక్తి సంబురాల్లో భాగంగా.. పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కోహెడలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్‌లు అందజేసే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో కలిసి గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారితకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లు ఉద్యమంలా ముందుకుసాగుతున్నాయన్నారు.
స్టీల్ బ్యాంక్‌ల విషయాన్ని మంత్రి పొన్నం తనకు చెప్పినప్పుడు ఎంతో నచ్చిందన్నారు. రాజకీయాలకు అతీతంగా, ప్రజల ఆరోగ్యం కోసం స్టీల్‌బ్యాంకులు ఏర్పాటు చేయాలనేది గొప్ప నిర్ణయమని కొనియాడారు. స్టీల్ బ్యాంకుల ఏర్పాటు చిన్నపనైనా భవిష్యత్‌లో ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రజారోగ్యం కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కారణంగా పరిసరాలు పచ్చదనాన్ని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్‌ను దూరం పెట్టాలి : మంత్రి కొండా సురేఖ
ప్లాస్టిక్‌ను దూరం పెడితేనే ఆరోగ్యంగా ఉంటామని, పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలని మంత్రి కొండా సురేఖ చెప్పారు. కరోనా తర్వాత ప్రతిఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందన్నారు. మహిళా సంఘాలతో స్టీల్ బ్యాంక్‌లు ఏర్పాటు చేయించడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ప్లాస్టిక్‌ను ముట్టుకోము అని మహిళలు ప్రమాణం చేసి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను జీవితంలో నుంచి దూరం చేయాలని పిలుపునిచ్చారు.
270 మహిళా సంఘాలతో స్టీల్ బ్యాంక్‌లు : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ నియోజకవర్గంలో 270 మహిళా సంఘాల చేత స్టీల్ బ్యాంక్‌లు ఏర్పాటు చేయిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఒక్కో స్టీల్ బ్యాంక్‌లో 13 రకాల సామగ్రితో 500, 400, 300 కిట్స్ ఉంటాయన్నారు. నియోజకవర్గంలో ఎవరూ అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్నదే తన కోరిక అన్నారు. ప్లాస్టిక్ రహితంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఆఫీసర్లను భాగస్వామ్యం చేసినట్టు వివరించారు.