త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్.. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్: గవర్నర్​

త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్.. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్: గవర్నర్​
  • హామీలన్నీ నెరవేరుస్తం ఇది ప్రజా ప్రభుత్వం: గవర్నర్​
  • త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్​, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్
  • 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తం.. వంద ఎకరాల్లో ఏఐ సిటీ
  • 12 ఫార్మా విలేజీలు.. ప్రతి కుటుంబానికీ కనీస ధరకే ఇంటర్నెట్​
  • రైతుభరోసా, రుణమాఫీ, కుల గణనకు కట్టుబడి ఉన్నం
  • గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన్రు
  • ధరణి సమస్యలు పరిష్కరిస్తామని హామీ.. ఉభయ సభల్లో ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: ఇది ప్రజా ప్రభుత్వమని, అందరికీ న్యాయం చేస్తామని గవర్నర్​ తమిళిసై తెలిపారు. తెలంగాణ ప్రజలు నిజమైన స్వాతంత్ర్య, ప్రజాస్వామ్య పరిపాలనను కోరుకుని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాపాలన నడుస్తున్నది. ఇందులో తొలిమెట్టుగా ప్రజావాణి నిలిచింది. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుని పరిష్కారం పొందేందుకు ఇదో సరైన వేదిక. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, అలుపెరుగని పోరాటం వల్ల సాధించిన రాష్ట్రంలో, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగానే పాలన కొనసాగిస్తం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నది. అర్హులైన కుటుంబాలకు త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్​, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీములను అందజేయనుంది” అని వెల్లడించారు. మాటల కంటే చేతలు ముఖ్యం అని, ఇచ్చిన వాగ్దానాలు అన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.  ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ వేశామని, ధరణి సృష్టించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, కుల గణనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కుటుంబాలన్నింటినీ సర్వే చేపట్టి.. అణచివేత, వివక్షకు గురైన అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. గురువారం శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రక్రియ అనేది వార్షిక మొక్కబడి కాదని, ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించేలా, ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా బడ్జెట్​ ఉంటుందన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, టీఎస్‌‌‌‌పీఎస్సీ వంటి సంస్థలకు మంచిగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.  

ఏఐ కాపిటల్‌‌‌‌గా తెలంగాణ

ఐటీ, ఫార్మా వంటి ప్రధాన రంగాలకు తమ సహకారం కొనసాగుతుందని గవర్నర్ తెలిపారు. ఇటీవలే దావోస్‌‌‌‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాలకు ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి హాజరయ్యారని, రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పలు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 10 నుంచి 12 ఫార్మా విలేజ్‌‌‌‌ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 1,000 నుంచి 3,000 ఎకరాల విస్తీర్ణంతో జనావాసాలకు దూరంగా ఇవి ఉంటాయని చెప్పారు. 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) సిటీని ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. కృత్రిమ మేధా కేంద్రాలను ఈ సిటీలో ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించడం ద్వారా తెలంగాణను ఏఐ కాపిటల్‌‌‌‌గా తీర్చుదిద్దుతామని పేర్కొన్నారు. 

కనీస ధరకు ఇంటర్నెట్‌‌‌‌

ప్రపంచంలో డిజిటలీకరణ వేగంగా జరుగుతున్నందున ఇంటర్నెట్‌‌‌‌ను ప్రాథమిక హక్కుగా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గవర్నర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి కనీస ధరకే ఇంటర్నెట్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.  రూ. 2 వేల కోట్లతో ఐటీఐలను అప్‌‌‌‌గ్రేడ్ చేస్తామని, ఈ ఐటీఐలలో ఎన్‌‌‌‌సీవీటీ ఆమోదించిన లాంగ్‌‌‌‌, షార్ట్ టర్మ్ కోర్సులను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ అవసరాలకు బొగ్గుపై ఎక్కువగా ఆధారపడుతున్నామని, దీన్ని తగ్గించేందుకు సౌర, పవన విద్యుత్‌‌‌‌ తయారీకి ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. ఇందుకోసం కొత్త పవర్ పాలసీ తీసుకొచ్చి హరిత ఇంధన వాటాను గణనీయంగా పెంచుతామన్నారు. కొత్త పర్యాటక పాలసీని కూడా తీసుకొస్తామని, పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను పెంపొందిస్తామని ఆమె ప్రకటించారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి, జీవనదిగా మారుస్తామని తెలిపారు. నగర తూర్పు, పశ్చిమ భాగాలను అనుసంధానించే రవాణా నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను, స్వచ్చమైన నీటిని, రివర్ ఫ్రంట్ సుందరీకరణ వంటి అంశాలు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఉంటాయన్నారు. యువత భవిష్యత్‌‌‌‌ను తీర్చిదిద్దడంలో ఉపాధి కల్పన, క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్ తెలిపారు. ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్రమంతటా స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు 

 ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడ్తం

రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన పార్టీలకు, నాయకులకు, రాష్ట్రం ఇచ్చిన అప్పటి ప్రధాని మన్మోహన్‌‌‌‌ సింగ్‌‌‌‌కు, సోనియా గాంధీకి గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో కృతజ్ఞతలు తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల రాష్ట్రంగా చేశారని అన్నారు. ప్రజలపై భారం పడకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ప్రస్తుత ప్రభుత్వానికి సవాలుగా మారిందని, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు, బాధ్యత, జవాబుదారీతనాన్ని అవలంబించడానికి ఈ బడ్జెట్ ఒక సదావకాశంగా తాము భావిస్తున్నామని చెప్పారు. గత దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థలు తిరిగి కోలుకునేందుకు తోడ్పాటును అందజేస్తామని తెలిపారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు, రైతులకు స్థిరమైన ప్రోత్సాహకాలు కల్పించడం తమ లక్ష్యమన్నారు. ఆర్థికాభివృద్ధికి పారిశ్రామిక రంగం, సేవ రంగం ముఖ్యమైనవని..  ఈ రెండు రంగాల్లో  నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలని తాము భావిస్తున్నామని వెల్లడించారు. ఎంఎస్​ఎంఈను ప్రోత్సహిస్తామని చెప్పారు.

కాళోజీతో మొదలు..భారతితో ముగింపు

ప్రముఖ కవి కాళోజీ రచించిన “అధికారమున్నదని హద్దుపద్దు లేక, అన్యాయమార్గాల నార్జింపబూనిన, అచ్చి వచ్చే రోజులంతమైనాయి, అచ్చి వచ్చే రోజులంతమైనాయి!" అనే కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతి రచించిన ‘‘విత్త నిర్వహణకు వివేక కాంతి పుంజం అవసరం” అనే  కవితతో ప్రసంగాన్ని ముగించారు.