తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం ! భూసేకరణ పరిహారం చెల్లింపునకూ మన రాష్ట్ర ప్రభుత్వం ఓకే

తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో త్వరలో ఒప్పందం ! భూసేకరణ పరిహారం చెల్లింపునకూ మన రాష్ట్ర ప్రభుత్వం ఓకే
  • ఆ రాష్ట్రానికి వెళ్లనున్న సీఎం రేవంత్​రెడ్డి
  • మహారాష్ట్ర సీఎంతో భేటీ అయి డిస్కస్​ చేసే అవకాశం
  • అక్టోబర్​ మొదటి వారంలో​ లేదంటే రెండో వారంలో షెడ్యూల్
  • ఇప్పటికే 150 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర సూత్రప్రాయ అంగీకారం!
  • భూసేకరణ పరిహారం చెల్లింపునకూ మన రాష్ట్ర ప్రభుత్వం ఓకే 
  • సమ్మక్క సాగర్​ ప్రాజెక్టు ఎన్​వోసీకి నేడు చత్తీస్​గఢ్​ వెళ్లనున్న మంత్రి​ ఉత్తమ్

హైదరాబాద్​, వెలుగు: గోదావరి నదిపై మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించతలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీపై ఒప్పందం కుదుర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టిపై సానుకూలంగా స్పందించడంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి. త్వరలో నిర్వహించే మన రాష్ట్ర కేబినెట్‌లో ఈ అంశాలపై చర్చించి, ముందుకెళ్లనున్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు తోడ్పడేలా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే అధికారవర్గాలు సంప్రదింపులు మొదలుపెట్టాయి.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తును మొదట 152 మీటర్లుగా ప్రతిపాదించారు. కానీ దీని వల్ల మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయనే అభ్యంతరాల నేపథ్యంలో, అప్పటి సీఎం కేసీఆర్ మహారాష్ట్రతో బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు తగ్గించడానికి 2016లో అంగీకరించారు. అయితే.. పలు కారణాలతో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా.. బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని  మేడిగడ్డకు మార్చింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ఇప్పుడు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్రంలోని కాంగ్రెస్​ సర్కారు  ఫోకస్​ పెట్టింది.

ఈ క్రమంలోనే  మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపి 150 మీటర్ల ఎత్తు వద్ద తుమ్మిడిహెట్టి  బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ నిర్ణయం వల్ల ప్రాజెక్టు నుంచి లభించే నీటి పరిమాణం కొద్దిగా తగ్గుతున్నప్పటికీ, ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోతాయని భావిస్తున్నది.  తెలంగాణ, మహారాష్ట్ర సీఎంల  కీలక భేటీలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన అంశాలను ముఖ్యంగా జలాల వాటా, భూసేకరణ, ముంపులాంటి అంశాలపై చర్చిస్తారని ఇరిగేషన్​ ఆఫీసర్లు చెప్తున్నారు. 150 మీటర్ల ఎత్తు వద్ద మహారాష్ట్రలోని 1500 ఎకరాలు ముంపుకు గురయ్యే అవకాశముందని ఇప్పటికే అంచనా వేశారు. దీంతో ఆయా  భూములకు అవసరమైన పరిహారం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే  బ్యారేజీ నిర్మాణం, పరిహారం చెల్లింపు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అవగాహన  ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది.

87 మీటర్లకు సమ్మక్క సాగర్​ ప్రాజెక్టుపై ఎన్​ఓసీ!
సమ్మక్కసాగర్‌‌ ప్రాజెక్టు (తుపాకులగూడెం బరాజ్‌‌)కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సోమ వారం చత్తీస్‌‌గఢ్‌‌ సీఎం విష్ణుదేవ్‌‌సాయ్​తో మన రాష్ట్ర ఇరిగేషన్‌‌శాఖ మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి భేటీ కానున్నారు. రూ. 9,257 కోట్లతో చేపట్టిన సమ్మక్కసాగర్‌‌ ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టు ప్రయోజనాలు– వ్యయాల (బెన్ఫిట్‌‌ కాస్ట్‌‌ రేషియా) మధ్య నిష్పత్తిని 1.67:1గా అంటే.. ప్రాజెక్టుపై రూపా యి వెచ్చిస్తే రూ. 1.67 రాబడి వస్తుందని డీపీఆర్‌‌లో అంచనా వేశారు. సమ్మక్క బరాజ్‌‌ బ్యాక్‌‌ వాటర్‌‌ నుంచి ఎత్తిపోసిన నీటిని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌‌ జిల్లాలకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మక్క సాగర్‌‌ ప్రాజెక్టుకు అనుమతులు సాధించాలంటే కొత్తగా 2 లక్షల ఎకరాల ప్రత్యేక ఆయకట్టును ప్రతిపాదించడంతోపాటు చత్తీస్‌‌గఢ్‌‌ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది.  దీంతో బరాజ్‌‌ వల్ల కలిగే ముప్పుపై ఐఐటీ ఖరగ్‌‌పూర్‌‌తో రాష్ట్ర ప్రభుత్వం స్టడీ చేయించగా బరాజ్‌‌ వద్ద 87 మీటర్ల గరిష్ట వరద సంభవిస్తే బీజాపూర్‌‌ జిల్లాలోని పోటూరు, కౌటూరు, తుగ్లగూడ, గంగారం, కంబాలపేట, సీతానగరంలో 100 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తేలింది. తక్కువ ముంపు ఉండనుందని తేలడంతో చత్తీస్‌‌గఢ్‌‌ ఎన్​ఓసీపై చర్చించేందుకు రావాలని కోరింది.