ఆటోకు లక్షన్నర.. క్యూర్ పరిధిలో పాత ఆటోల స్థానంలో ఈవీలు

ఆటోకు లక్షన్నర..  క్యూర్ పరిధిలో పాత ఆటోల స్థానంలో ఈవీలు
  • 18,766 పాత ఆటోల మార్పిడికి రూ.200 కోట్లు
  • రాజీవ్ యువ వికాసం కింద నిధుల కేటాయింపు
  • ప్రస్తుతం డీజిల్ 11,254.. పెట్రోల్ 7,512 ఆటోలు
  • కొత్త ఈవీ లేదా ఎలక్ట్రిక్ కిట్‌‌‌‌.. డ్రైవర్‌‌‌‌దే చాయిస్
  • రెండు ఆప్షన్లకూ గరిష్టంగా రూ.1.50 లక్షల సాయం
  • డీలర్లు, కిట్‌‌‌‌ తయారీదారుల ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీ
  • పాత ఆటో స్క్రాప్‌‌‌‌ చేసిన తర్వాతే సబ్సిడీ విడుదల


హైదరాబాద్, వెలుగు: కోర్​అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో తిరుగుతున్న పెట్రోల్, డీజిల్ ఆటోలను పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్–2026ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘రాజీవ్ యువ వికాసం’కింద ఈ స్కీమ్‌‌‌‌ అమలు చేయనున్నారు. అర్బన్ పరిధిలో పర్మిట్లు కలిగిన మొత్తం 18,766 పాత ఆటోలు ఉండగా, అందులో 11,254 డీజిల్, 7,512 పెట్రోల్ వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. వీటన్నింటినీ దశలవారీగా ఈవీలుగా మార్చేందుకు రూ.200 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. ఈ బడ్జెట్‌‌‌‌ను ‘సింగిల్ స్కీమ్- మల్టిపుల్ ఫండింగ్ స్ట్రీమ్స్’విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల సబ్-ప్లాన్ నిధుల నుంచి ఒక్కో శాఖ రూ.50 కోట్ల చొప్పున సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. లబ్ధిదారుల సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా అర్హులైన ఆటో యజమానులందరికీ ఈ స్కీమ్ సమానంగా వర్తిస్తుంది.

ఆటో డ్రైవర్లకు రెండు ఆప్షన్లు.. 

పథకం కింద ఆటో డ్రైవర్లకు తమ అవసరాన్ని బట్టి రెండు ప్రత్యామ్నాయాల్లో ఒకదానిని ఎంచుకునే హక్కును (రైట్ ఆఫ్ ఛాయిస్) ప్రభుత్వం కల్పించింది. ‘కాంపోనెంట్- ఏ’కింద పాత వాహనం చాసిస్‌‌‌‌ను కొనసాగిస్తూ, అనుమతి పొందిన ఏఐఎస్​-123 ఎలక్ట్రిక్ కిట్‌‌‌‌(రెట్రో-ఫిట్మెంట్)ను అమర్చుకోవచ్చు. దీనికి అసలు కిట్ ఖర్చు లేదా గరిష్టంగా రూ.1,50,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో ఫిక్స్‌‌‌‌డ్ బ్యాటరీ లేదా స్వాపబుల్ బ్యాటరీ కిట్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. ‘కాంపోనెంట్- బీ’కింద పాత పెట్రోల్, డీజిల్ ఆటోను పూర్తిగా ప్రభుత్వానికి సరెండర్ చేసి, సరికొత్త ఎల్ 5ఎం కేటగిరీ ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసేందుకు రూ.1,50,000 ఫ్లాట్ సబ్సిడీని మంజూరు చేస్తారు. ఎంపానెల్ అయిన డీలర్లు వాహనం తుది ఆన్-రోడ్ ధర నుంచి ఈ రాయితీ మొత్తాన్ని ముందే మినహాయించి వాహనాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కిట్ లేదా కొత్త వాహనం ధర రూ.1.50 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఆ వ్యత్యాసాన్ని లబ్ధిదారుడే భరించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

పూర్తి డిజిటల్​ విధానంలో.. 

స్కీమ్ నిధుల పంపిణీలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం పూర్తి డిజిటల్ విధానాన్ని తప్పనిసరి చేసింది. లబ్ధిదారుల చేతికి నేరుగా ఎలాంటి నగదు ఇవ్వకుండా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌‌‌ఫర్ (డీబీటీ) ద్వారా ఎంపానెల్ అయిన కిట్ తయారీదారులు లేదా ఈవీ డీలర్ల బ్యాంక్ అకౌంట్లలోకే సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తారు. పాత ఇంజిన్ లేదా వాహనాన్ని అధికారికంగా స్క్రాప్ చేసి, ఆ సర్టిఫికెట్‌‌‌‌తో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేసిన తర్వాతే రవాణా శాఖ నిధులను విడుదల చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌‌‌‌వేర్ మాడ్యూల్‌‌‌‌ను సిద్ధం చేస్తున్నారు. వాహన్ డేటాబేస్ ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి ఆటోమేటెడ్ విధానంలో ఆమోదం తెలుపుతారు. మొదటి 8 వారాల్లో తయారీదారుల ఎంపానెల్మెంట్, రేట్ కాంట్రాక్టుల ఖరారు పూర్తి చేసి, 8వ వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. పథకం ప్రారంభమైన 16వ వారం నాటికి పూర్తిస్థాయి డీబీటీ ఆటోమేషన్ ప్రక్రియ అమల్లోకి వస్తుందని రవాణా శాఖ పేర్కొంది.

అమలు కోసం మూడంచెల వ్యవస్థ..

ఈ స్కీమ్‌‌‌‌ పథకం అమలు, నిరంతర పర్యవేక్షణ కోసం ప్రభుత్వం మూడంచెల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ (ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ఎస్‌‌‌‌సీ), రవాణా కమిషనర్ చైర్మన్‌‌‌‌గా పథక అమలు కమిటీ, కలెక్టర్లు లేదా మున్సిపల్ కమిషనర్ల అధ్యక్షతన జిల్లా సాంక్షన్ కమిటీలు పనిచేస్తాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వాహనాలకు కఠినమైన సాంకేతిక ప్రమాణాలను విధించారు. బ్యాటరీ ప్యాక్‌‌‌‌లకు ఏఐఎస్​-156 ధ్రువీకరణ తప్పనిసరి. పూర్తి ఛార్జింగ్‌‌‌‌పై వాహనం కనీసం 100 కి.మీ మైలేజీ (స్వాపబుల్ బ్యాటరీకి ప్యాక్‌‌‌‌కు 70 కి.మీ), గంటకు కనీసం 45 కి.మీ వేగం, 12 శాతం గ్రేడబిలిటీ సామర్థ్యం ఉండాలి. కిట్‌‌‌‌పై రెండేళ్లు, అలాగే బ్యాటరీ, మోటార్, కంట్రోలర్‌‌‌‌పై రెండేండ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ ఇవ్వడం తప్పనిసరి. క్యూర్ పరిధిలో విడిభాగాల లభ్యతతో పాటు కనీసం ఒక అధీకృత సర్వీస్ సెంటర్ ఉన్న కంపెనీలకే ప్రభుత్వం ఎంపానెల్మెంట్ కల్పించనుంది. లబ్ధిదారుల సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా అర్హులైన ఆటో యజమానులందరికీ ఈ స్కీమ్ సమానంగా వర్తిస్తుంది.