విద్యుత్ సంస్థల డైరెక్టర్లపై వేటు

విద్యుత్ సంస్థల డైరెక్టర్లపై వేటు

 

  • డిస్కమ్స్ నుంచి 11 మంది, ట్రాన్స్​కో, జెన్​కో నుంచి  10 మంది తొలగింపు 
  • ఆదేశాలు జారీ చేసిన సర్కార్​
  • ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  సదరన్, నార్తర్న్ డిస్కమ్స్​లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 11 మంది డైరెక్టర్లపై రాష్ట్ర సర్కార్ వేటు వేసింది. అదేవిధంగా.. ట్రాన్స్​కో, జెన్​కోలో పని చేస్తున్న మరో పది మంది డైరెక్టర్లను కూడా తొలగిస్తూ సోమవారం ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా డిస్కమ్​ల నుంచి తొలగించిన 11 మంది డైరెక్టర్లలో టీఎస్ ఎస్​పీడీసీఎల్ నుంచి ఏడుగురు, ఎన్​పీడీసీఎల్ నుంచి నలుగురు ఉన్నారు. ఐఏఎస్ లు ఉండాల్సిన సీఎండీ పోస్టుల్లో గత బీఆర్ఎస్ సర్కార్.. రిటైర్డ్ అయిన వాళ్లను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ సర్కార్ బాధ్యతలు చేపట్టకముందే.. ట్రాన్స్​కో జెన్​కో, నార్తర్న్ డిస్కమ్ సీఎండీలు రాజీనామా చేశారు. తాజాగా ట్రాన్స్ కో, జెన్​కో, డిస్కమ్ ల సీఎండీలను, ట్రాన్స్​కో జేఎండీ బాధ్యతలను ఐఏఎస్ అధికారులకు కాంగ్రెస్ సర్కార్ అప్పగించింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సంస్థల మీద నియంత్రణ లేకపోవడంతో రాయితీల ఖర్చులు భారీగా పెరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతోనే విద్యుత్ సంస్థ అప్పులు ఊబిలో కూరుకుపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ డైరెక్టర్ల పెత్తనంతో ప్రమోషన్లలో అక్రమాలు, అనాలోచిత నిర్ణయాలతో డిస్కమ్​లకు నష్టాలు వచ్చాయనే ఆరోపణలూ ఉన్నాయి. 

70 ఏండ్లు పైబడినోళ్లు 15 మంది

గత పదేండ్లలో ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో, టీఎస్‌‌ ఎస్‌‌పీడీసీఎల్‌‌, టీఎస్‌‌ ఎన్‌‌పీడీసీఎల్‌‌ సంస్థల్లో సీఎండీలు, డైరెక్టర్లు, జెన్‌‌కో జేఎండీలతో పాటు 28 డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో ఆరుగురు ఇన్ సర్వీస్ అధికారులు ఉండగా.. మిగిలినవారంతా రిటైర్డ్ ఉద్యోగులే కావడం గమనార్హం. 70 ఏండ్లు పైబడిన 15 మందితో విద్యుత్ శాఖను బీఆర్ఎస్ సర్కార్ నడిపించింది. ఐఏఎస్​లు ఉండాల్సిన సీఎండీ పదవుల్లో.. రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్లు, ఇంజినీర్లు కొనసాగారు. ఒక్కో డైరెక్టర్​కు బీఆర్ఎస్ సర్కార్ అన్ని సౌకర్యాలు కల్పించి.. నెలకు రూ.3లక్షల జీతం చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగులను రెండేండ్ల పాటు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ పొడిగించినా నాలుగేండ్ల దాకా కొనసాగించొచ్చు.. కానీ, బీఆర్ఎస్ సర్కార్ మాత్రం పదేండ్ల పాటు పర్మినెంట్ ఎంప్లాయీస్ మాదిరి సంస్థల్లో కొనసాగించింది. తెలంగాణ ఏర్పాటు కాకముందు నుంచి ఉన్నవారు కూడా ఇప్పటిదాకా విద్యుత్ సంస్థల్లో కొనసాగారు. 2019లోనే పదవుల గడువు పూర్తయినా.. అంటిల్ ఫర్ ఆర్డర్ అనే ఉత్తర్వుతో వీరందరినీ బీఆర్ఎస్ సర్కార్ కొనసాగిస్తూ వచ్చింది.

ట్రాన్స్​కోలో ముగ్గురు, జెన్‌‌కోలో ఐదు పోస్టుల భర్తీ

డైరెక్టర్ల భర్తీ కోసం ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సంస్థలు నోటిఫికేషన్‌‌ విడుదల చేశాయి. డైరెక్టర్ల పదవీ కాలం గరిష్టంగా నాలుగేండ్లు పూర్తయిన వారి స్థానాల్లో కొత్తవారిని నియమించాలని ఇప్పటికే ఎనర్జీ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ రిజ్వీ ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్‌‌ ఇచ్చాయి. ట్రాన్స్‌‌కో గ్రిడ్‌‌, ట్రాన్స్​మిషన్ డైరెక్టర్‌‌, ప్రాజెక్ట్స్‌‌ డైరెక్టర్‌‌, ఫైనాన్స్‌‌ డైరెక్టర్‌‌ ఇలా 3 డైరెక్టర్‌‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. అదే విధంగా జెన్‌‌కోలో హైడల్‌‌ డైరెక్టర్‌‌, థర్మల్‌‌, ప్రాజెక్ట్స్‌‌ డైరెక్టర్‌‌, హెచ్‌‌ఆర్‌‌, ఐఆర్‌‌ డైరెక్టర్‌‌, కోల్‌‌, లాజిస్టిక్స్‌‌ డైరెక్టర్, ఫైనాన్స్‌‌, కమర్షియల్‌‌ డైరెక్టర్‌‌ ఇలా 5 పోస్టులకు నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. 

డైరెక్టర్‌‌ పదవులకు అర్హతలు ఇవే..

డైరెక్టర్‌‌ పదవులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం సంబంధిత బ్యాచిలర్‌‌ డిగ్రీతో పాటు 15 ఏండ్లు విద్యుత్‌‌రంగంలో పనిచేసి ఉండాలి. 25 ఏండ్ల పాటు స్టేట్‌‌, సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌, గవర్నమెంట్‌‌ సెక్టార్‌‌ సంస్థల్లో పని చేసి ఉండాలి. కనీసం మూడేండ్లు సీఈ, సీజీఎం, ఎస్‌‌ఈ, ఈడీ స్థాయిలో పని చేసి ఉండాలి. నోటిఫికేషన్‌‌ నాటికి అభ్యర్థులు వయస్సు కనీసం 62 ఏండ్లకు మించకూడదు. డైరెక్టర్లుగా ఎంపికైన వాళ్లు  రెండేండ్ల పాటు కొనసాగుతారు. కనీసం ఏడాది చొప్పున రెండు సార్లు పొడిగించే అవకాశం ఉంటుంది.