కాళేశ్వరం కమిషన్​ గడువు రెండు నెలలు పెంపు

కాళేశ్వరం కమిషన్​ గడువు రెండు నెలలు పెంపు
  • కమిషన్​కు అఫిడవిట్లు సమర్పించిన ఇరిగేషన్​ ఆఫీసర్లు
  • వచ్చే నెల 5న రాష్ట్రానికి కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ ఘోష్​
  • ప్రజల నుంచి వచ్చిన అఫిడవిట్లపై బహిరంగ విచారణ
  • అధికారులను క్రాస్​ ఎగ్జామినేషన్​ చేసే చాన్స్​
  • గత ప్రభుత్వ పెద్దలనూ పిలిచే అవకాశం

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ గడువును రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు శనివారం ఇరిగేషన్​ శాఖ కార్యదర్శి రాహుల్  బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్​ గడువు ఆదివారంతో ముగియనుండగా ఆగస్టు 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఈ ఏడాది మార్చి 14న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ నేతృత్వంలో జ్యుడీషియల్​ కమిషన్​ను రాష్ట్ర ప్రభుత్వం ఫాం చేసింది. హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో కమిషన్​కు ఆఫీస్​ స్పేస్​ను కూడా కేటాయించింది. కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ ఘోష్​ జులై 5న మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈసారి అధికారులను క్రాస్​ ఎగ్జామినేషన్​ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలోని కీలక నేతలను విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. 

మూడు దఫాలు రాష్ట్రానికి

వాస్తవానికి కమిషన్​ను ఏర్పాటు చేసేటప్పుడు వంద రోజుల్లో రిపోర్ట్​ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే జూన్​ 30 నాటికి కాళేశ్వరం అక్రమాలు, అవకతవకలపై రిపోర్ట్​ ఇవ్వాల్సిందిగా కమిషన్​ను కోరింది. అయితే, జస్టిస్​ ఘోష్​ ఇప్పటికే మూడు దఫాలుగా రాష్ట్రానికి వచ్చి అధికారులతో సమావేశమై అన్ని వివరాలను తెలుసుకున్నారు. తొలిసారిగా రాష్ట్రానికి ఏప్రిల్​ 24న ఆయన వచ్చారు. అప్పుడు మూడు రోజుల పాటు ఉండి అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మే 6న మరోసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్​ ఘోష్​.. కుంగిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించారు. దాంతోపాటు ఆఫీసర్లతో సమావేశమై విచారణ జరిపారు. రెండో దఫా పర్యటనలో ఆరు రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. 

ఆ తర్వాత ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​తో సంబంధం లేని నిపుణులతో టెక్నికల్​ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. టెక్నికల్​ కమిటీని ఏర్పాటు చేశాక మూడోసారి ఈ నెల 6న రాష్ట్రానికి వచ్చిన ఆయన.. బ్యారేజీలను టెక్నికల్​కమిటీలతో కలిసి పరిశీలించారు. బ్యారేజీలకు సంబంధించిన అంశాలను తెలుసుకున్నారు. ఇదే దఫాలో మాజీ ఈఎన్సీ మురళీధర్​తో పాటు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లోని అన్ని విభాగాల అధికారులతోనూ సమావేశమయ్యారు. వారు చెప్పిన వివరాలను జూన్​ 27లోగా అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని ఆదేశించారు. 

జనం నుంచి కూడా అఫిడవిట్లు

అధికారుల నుంచే కాకుండా సామాన్యుల నుంచి కూడా వివరాలను తెలుసుకునే పనిలో జస్టిస్​ పీసీ ఘోష్​ నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే పబ్లిక్​ నుంచి ఆధారాలను తీసుకునేందుకు బహిరంగ ప్రకటనను జారీ చేశారు. బీఆర్కే భవన్​లో ఏర్పాటు చేసిన సజెషన్స్​ బాక్స్​లో అఫిడవిట్లను సమర్పించాల్సిందిగా బహిరంగ ప్రకటనలో పేర్కొన్నారు. మే 31 వరకు గడువు విధించగా 54 అఫిడవిట్లు వచ్చాయి. అయితే, అందులో సింహభాగం పరిహారానికి సంబంధించినవే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇటు అధికారుల నుంచి కూడా అఫిడవిట్లు అందాయి. ఈ నేపథ్యంలోనే జులై 5 నుంచి మరోసారి జస్టిస్​ ఘోష్​ విచారణ జరపనున్నారు. ఈ సారి ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలపై బహిరంగ విచారణ జరపడంతో పాటు.. అధికారుల నుంచి వచ్చిన అఫిడవిట్ల ఆధారంగా వారిని క్రాస్​ ఎగ్జామినేషన్​ కూడా చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆనాటి రాజకీయ పెద్దలను కూడా విచారణకు పిలుస్తారని సమాచారం.

వంద రోజుల్లో పూర్తి కానందునే..

కాళేశ్వరంపై వంద రోజుల్లోనే జ్యుడీషియల్​ కమిషన్​ విచారణ పూర్తి చేస్తుందని రాష్ట్ర సర్కారు గతంలో ప్రకటించింది. అయితే, జస్టిస్​ ఘోష్​ పక్కా ఆధారాలను సేకరిస్తున్నారు. వాటి ఆధారంగానే విచారణ జరపాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే తొలి దశలో మాజీ అధికారులు, ఇరిగేషన్​ అధికారులు, ప్రజల నుంచి అఫిడవిట్లను తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగింది కేవలం ఆధారాల సేకరణేనని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఈసారి జరిగే విచారణే సీరియస్​గా ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం జూన్​ 30 వరకు రిపోర్ట్​ ఇవ్వాలని కోరినా.. అది సాధ్యపడదని జస్టిస్​ ఘోష్​ గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కమిషన్​ గడువును మరో రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.