సీఎంఆర్ గడువు మరోసారి పెంపు : 90 రోజులు అవకాశం ఇస్తూ జీవో జారీ

సీఎంఆర్ గడువు మరోసారి పెంపు : 90 రోజులు అవకాశం ఇస్తూ జీవో జారీ

హైదరాబాద్, వెలుగు: డిఫాల్టింగ్ మిల్లర్లకు పెండింగ్​లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇచ్చేందుకు రికవరీ గడువును మరో 90 రోజుల పాటు పొడగిస్తున్నట్టు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ డీఎస్ చౌహాన్ జీవో జారీ చేశారు. ఈ పొడిగింపు 2019–20, 2020–-21 యాసంగి సీజన్, 2021–22 వానాకాలం, యాసంగి, 2022-–23 వానాకాలం సీజన్ సీఎంఆర్ బకాయిలకు వర్తిస్తుందని సివిల్ సప్లయ్స్ కమిషనర్ జీవోలో పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సీఎంఆర్ ధరకు 125% లేదా 12% వార్షిక వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది నగదు రూపంలోనైనా, బియ్యం రూపంలో (స్టేట్ పూల్‌‌కు) రికవరీ చేయవచ్చు అని తెలిపారు. ఇదే లాస్ట్ అని, మరోసారి గడువు పొడిగించమని పేర్కొన్నారు. అయినప్పటికీ, తాజాగా ఇచ్చిన గడువులోగా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే డిఫాల్టర్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీస్కుంటామని కమిషనర్ హెచ్చరించారు.

డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం మిల్లింగ్ కు అనుమతివ్వకుండా అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. ఈ పెండింగ్ సీఎంఆర్​ను సివిల్ సప్లయ్స్ కమిషనర్ అన్ని జిల్లాల మేనేజర్లు, సివిల్ సప్లయ్స్ అధికారుల సమన్వయంతో రికవరీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.