స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రక్షాళన!

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రక్షాళన!
  •     రెండేండ్లు పైబడినోళ్లందరికీ బదిలీ..రాష్ట్ర సర్కారు నిర్ణయం
  •     ఏండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న సబ్​ రిజిస్ర్టార్లు
  •     భారీగా అవినీతి చోటు చేసుకుంటున్నట్టు నిర్ధారణ  
  •     ఎన్నికల కోడ్ తో సంబంధం లేకపోవడంతో వారం రోజుల్లోపు పూర్తి చేయాలని నిర్ణయం 

హైదరాబాద్​, వెలుగు :  స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్స్​ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోనే ఆ శాఖలో జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్​ అసిస్టెంట్లను పూర్తిస్థాయిలో బదిలీ చేయాలని భావిస్తున్నది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నప్పటికీ.. స్టాంప్స్​ అండ్​ రిజిస్ర్టేషన్లు ఎన్నికల విధులకు సంబంధం లేనిది కావడంతో త్వరలోనే బదిలీలు ముగించాలని చూస్తున్నది. ఏండ్లుగా ఒకేచోట తిష్ట వేసిన అధికారులకు స్థానచలనం కల్పించడంతోపాటు భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జరిగిన అవినీతిని వెలికితీయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా రెండేండ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్న వారందరినీ బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. నియమ, నిబంధనలు తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్లు చేస్తున్న కొందరు సబ్​ రిజిస్ర్టార్లపై వేటు వేసేందుకూ ప్రభుత్వం రెడీ అవుతున్నది.  

11 ఏండ్లుగా జనరల్​ ట్రాన్స్​ఫర్లు లేవు

ప్రభుత్వ ఉద్యోగులకు మూడేండ్లకు ఓసారి బదిలీలు సాధారణంగా జరుగుతాయి. అయితే, రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి మాత్రం కొన్నేండ్లుగా ఆ నిబంధన వర్తించడం లేదు.  రాష్ట్ర ఖజానాకు ఎక్కువ రాబడి తేచ్చే శాఖల్లో ఇది ఒకటి కాగా..  ఇందులో కొందరు అధికారులు ఏండ్ల తరబడి తిష్ట వేశారు. ఉంటే సబ్  రిజిస్ట్రార్లుగా.. లేదంటే ఇన్​చార్జిగా విధులు చక్కబెడుతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు జరిగి దాదాపు 11 ఏండ్లు అవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సబ్‌‌‌‌ రిజిస్ట్రార్ల జనరల్​ ట్రాన్స్​ఫర్లు జరిగాయి. రాష్ట్రం ఏర్పడిన తరువాత బదిలీలు జరగలేదు. అయితే డిప్యూటేషన్లు, ఇన్ చార్జి పోస్టులు జోరుగా సాగాయి. 

మియాపూర్‌‌‌‌ భూ కుంభకోణం తర్వాత 2017లో కొందరు సబ్​ రిజిస్ట్రార్లను, అధికారులను బదిలీ చేశారు. ఆ తర్వాత   లోకల్‌‌‌‌ కేడర్‌‌‌‌ అలాట్‌‌‌‌మెంట్‌‌‌‌లో భాగంగా సీనియారిటీ ప్రాతిపదికన కొన్ని పోస్టులు అటుఇటు అయ్యాయి. 2010 తర్వాత కింది స్థాయి సిబ్బంది బదిలీలు  జరగనే లేదు. స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్​​లో   బదిలీలపై ఇప్పటికే నాలుగైదు సార్లు ప్రతిపాదనలు సిద్ధం చేసినా అమలు చేయలేదు. అయితే, ఇప్పుడు వారం రోజుల్లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ నవీన్ మిట్టల్​ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆయన వారం రోజుల్లో హైదరాబాద్​కు తిరిగి వస్తారు. ఆ వెంటనే బదిలీలు చేపట్టే చాన్స్​ ఉన్నది. ఇప్పటికే ప్రపోజల్స్​ రెడీ చేసినట్టు తెలిపారు. 

అవినీతి, అక్రమాలు ఎక్కువే

రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ల కొరత ఉండటంతో కొన్నేండ్లుగా జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్లుగా  విధులు నిర్వర్తిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది.  రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. అన్ని జిల్లాల్లో పలువురు సబ్ రిజిస్ట్రార్లు 5 ఏండ్లకు పైగా ఓకే చోట విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఏసీబీకి పట్టుబడుతున్న అధికారుల్లోనూ సబ్​రిజిస్టార్లు ఎక్కువగానే ఉంటున్నారు.  

ప్రతి డాక్యుమెంట్​కు ఇంత అని ముందే ఒక కమీషన్​ను నిర్ధారించుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రిజిస్ట్రేషన్​​ ఆఫీసులకు వెళ్లాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆయా సబ్‌‌‌‌ రిజిస్ట్రార్లు, సిబ్బందిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నా వారికి ఉన్న అండదండలతో అక్కడే కొనసాగుతూ వస్తున్నారు.