ఉప సర్పంచ్లకూ చెక్కులపై సంతకాలు చేయకుంటే సస్పెన్షనే

ఉప సర్పంచ్లకూ చెక్కులపై సంతకాలు చేయకుంటే  సస్పెన్షనే

హైదరాబాద్‌‌, వెలుగు: జాయింట్​చెక్​పవర్​ఉన్నా చెక్కులపై సంతకాలు పెట్టకుండా సర్పంచ్‌‌లను ఇబ్బందులకు గురిచేస్తున్న ఉపసర్పంచ్‌‌లపై వేటు పడుతోంది. ఎలాంటి కారణాలు లేకుండా ఉద్దేశపూర్వకంగా చెక్కులపై సంతకం చేయని ఉపసర్పంచ్‌‌లపై ఫిర్యాదు అందితే అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్‌‌ అర్బన్‌‌ జిల్లాలో ఓ ఉపసర్పంచ్‌‌పై పంచాయతీరాజ్‌‌ చట్టం–2018 సెక్షన్‌‌ 37(5) ప్రకారం ఆరు నెలలపాటు ఆ జిల్లా కలెక్టర్‌‌ సస్పెన్షన్‌‌ వేటు వేశారు.

జాయింట్ చెక్‌‌పవర్‌‌ తో తంటా..

గతంలో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌‌, పంచాయతీ కార్యదర్శికి జాయింట్‌‌ చెక్‌‌ పవర్‌‌ ఉండేది. కొత్త పంచాయతీరాజ్‌‌ చట్టం–2018 ప్రకారం సర్పంచ్‌‌, ఉపసర్పంచ్‌‌కు మాత్రమే జాయింట్‌‌ చెక్‌‌పవర్‌‌ కల్పించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సర్పంచ్‌‌లు చాలాకాలంగా డిమాండ్​ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌‌ 6 నుంచి అక్టోబర్‌‌ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 రోజుల యాక్షన్‌‌ ప్లాన్‌‌ చేపట్టింది. ఈ సందర్భంగా లక్షలాది రూపాయలు అప్పులు చేసి సర్పంచ్​లు పనులు చేపట్టారు. బిల్లులు పొందే విషయంలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులకు సంబంధించిన చెక్కులపై సంతకం చేయడానికి ఉప సర్పంచ్‌‌లు ఇబ్బందులు పెడుతుండటంతో తలలు పట్టుకుంటున్నారు. దీనిపై కొందరు సర్పంచ్​లు పంచాయతీరాజ్‌‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.