కరెంటు సరఫరాలో నిర్లక్ష్యంపై సర్కారు నజర్‌‌

కరెంటు సరఫరాలో నిర్లక్ష్యంపై సర్కారు నజర్‌‌
  • నిరుడి కన్నా ఎక్కువ పవర్  సప్లై చేస్తున్నా సోషల్‌‌ మీడియాలో దుష్ప్రచారంపై సీరియస్‌‌
  •     ప్రభుత్వ ఆదేశాలతో అధికారులపై డిస్కంల చర్యలు

హైదరాబాద్‌‌, వెలుగు: కరెంటు సరఫరాలో నిర్లక్ష్యంపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. నిరుడు జనవరి, ఫిబ్రవరిలో సరఫరా చేసిన కరెంటు కన్నా ఎక్కువే సరఫరా చేస్తున్నా దుష్ప్రచారం జరుగుతోందని సర్కారు గుర్తించింది. మెయింటెన్స్‌‌ కోసం ఎల్‌‌సీలు తీసుకుంటే కరెంటు కోతలు లేకపోయినా కోతలంటూ ప్రచారం జరుగుతోందని, ఇదంతా కొందరు అధికారులు కావాలనే చేస్తున్నట్లు గ్రహించింది. ‘‘కాంగ్రెస్‌‌ వచ్చింది.. కరెంట్‌‌ పోయింది” అని సోషల్‌‌  మీడియాలో వార్తలు వైరల్‌‌ కావడంతో ప్రభుత్వం సీరియస్‌‌ గా తీసుకుంది. 

ఈ నేపథ్యంలో కరెంటు సరఫరాలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, ఎల్‌‌సీలపై  కఠినంగా వ్యవహరించాలని డిస్కంలను ప్రభుత్వం ఆదేశించింది.  సర్కారు ఆదేశాల మేరకు రైతులు, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేదిలేదని అధికారులకు డిస్కంలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. కరెంటు సరఫరాలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. ఇప్పటికే సదరన్‌‌  డిస్కంలో ఓ డైరెక్టర్‌‌‌‌పై వేటు వేసిన సర్కారు‌‌.. తాజాగా కరెంట్‌‌  సరఫరాలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు డీఈ స్థాయి అధికారులపై పాలనపరమైనా చర్యలు తీసుకుంది. 

వ్యవసాయానికి మూన్నాలుగు రోజుల పాటు కరెంటు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో మిర్యాలగూడ డీఈ వెంకటేశ్వర్లుకు చార్జ్‌‌ మెమో ఇచ్చింది. ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలిలో ఒకేరోజు ఎనిమిది సార్లు 4 గంటలు విద్యుత్తు నిలిపివేయడంతో సదరు డీఈ గోపాలకృష్ణను హెడ్‌‌ ఆఫీసుకు సరెండఒర్‌‌  చేశారు. మహబూబ్‌‌నగర్‌‌  పరిధిలో వ్యవసాయ కనెక్షలకు సంబంధించి చెకింగ్‌‌  చేస్తూ కరెంటు సరఫరా నిలిపివేయడంపైనే ప్రభుత్వం సీరియస్‌‌గా తీసుకుంది. ఒక డైరెక్టర్‌‌  పురికొల్పడం వల్లే ఈ వ్యవహరం జరిగిందని గుర్తించి సదరు డైరెక్టర్‌‌ను తొలగించింది.

మెయింటెనెన్స్‌‌ పనుల్లోనూ జాప్యం

ఎప్పుడో పూర్తి చేయాల్సిన పనుల్లో జాప్యం చేసి కొత్త సర్కారు వచ్చి రావడంతోనే మెయింటెనెన్స్‌‌ పనులంటూ అధికారులు విద్యుత్‌‌  సరఫరా నిలిపివేశారు. దీంతో ప్రజల్లో కొత్త ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం జరిగింది. దీంతో సర్కారు సీరియస్‌‌ అయింది. ఆపరేషన్‌‌  డైరెక్టర్‌‌  నిర్లక్ష్యం వల్లే పనులు లేట్‌‌గా చేపట్టారని గుర్తించి ఆ డైరెక్టర్ పై వేటు వేశారు.

సీఎం హెచ్చరికతో విద్యుత్  సంస్థలు అలర్ట్

ఫిబ్రవరిలో 15,031 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌‌  డిమాండ్‌‌ వచ్చింది. నిరుడు 14,649 మెగావాట్‌‌ల గరిష్ట విద్యుత్‌‌  డిమాండ్  ఉండగా ఈసారి అది 4.6 శాతం అధికం. నిరుటి కన్నా 20 మిలియన్‌‌  యూనిట్లు అధికంగా సరఫరా జరుగుతోంది. వ్యవసాయ కరెంటు కూడా గత ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలతో పోలిస్తే 16.36 వాతం అధికంగా ఉంది. 

ఇలా  గతంలో కంటే ఎక్కువ కరెంటు సరఫరా చేస్తున్నా సోషల్‌‌ మీడియాలో  విమర్శలు రావడంతో అధికారులపై సీఎం రేవంత్‌‌ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 నిమిషాలకు మించి కరెంటు పోయినా సమాచారం ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్‌‌  వేటు వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో విద్యుత్‌‌  సంస్థలు అలర్ట్‌‌ అయ్యాయి. శుక్రవారం కొండాపూర్‌‌  పరిధిలోని ఓ ప్రైవేటు అపార్ట్‌‌మెంట్‌‌ లో ట్రాన్స్‌‌ఫార్మర్‌‌  ఏర్పాటు చేయడానికి ఆ ప్రాంతంలో పవర్  సప్లై బంద్‌‌  చేశారు. ఫిర్యాదులు రావడంతో సదరు లైన్‌‌మెన్‌‌, ఇద్దరు ఆర్టీజన్‌‌లను సస్పెండ్‌‌ చేశారు.