
- సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ ఒకేచోటుకి
- ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసేందుకు సర్కారు కసరత్తు
- పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర ఎంపిక
- దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో..
- ల్యాండ్ రెడీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రంలోని 25 చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేస్తోంది. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ లు ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఈ అకాడమిక్ ఇయర్‌నుంచే ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నది.
అనంతరం నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నది. ఒకే చోట ఈ భవనాలు నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తే విద్యార్థుల ప్రతిభా పాటవాలతో పాటు పోటీతత్వం పెరుగుతుందని, కుల, మత వివక్ష తొలిగిపోతుందని ప్రభుత్వం సంకల్పించింది. గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా నిర్వహించే వీలుంటుందని భావిస్తోంది.
పైలట్ ప్రాజెక్టుగా 2 నియోజకవర్గాలు ఎంపిక
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌ల ఏర్పాటుకు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టులుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిరలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ రెండు ప్రాంతాలను బీసీ వెల్ఫేర్ అధికారులు పరిశీలించారు. దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. దీంతో అధికారుల పర్యవేక్షణకు ఇబ్బందులు ఎదురువుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది.
ఈ ఏడాది 25 క్యాంపస్‌లు
ఈ అకాడమిక్ ఇయర్ లో రాష్ట్రవ్యాప్తంగా 25 చోట్ల ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో కొడంగల్, మధిరతోపాటు మరో 8 నియోజకవర్గాల్లో ల్యాండ్ అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ల్యాండ్ గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇపుడున్న గురుకులాల దగ్గర ప్రభుత్వ భూములు ఉన్నాయా? లేదా? ఇతర చోట్ల ఉన్నాయా? అన్న వివరాలు అందించాలని ఆదేశించింది. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో వీటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించనుంది.
ఎక్కువ శాతం అద్దె భవనాల్లోనే గురుకులాలు
రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ గురుకులాల క్యాంపస్ లు ఎక్కువ శాతం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 700 స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ ఉండగా.. 313 అద్దె భవనాల్లో ఉన్నాయి. వీటికి సొంత భవనాల నిర్మాణానికి రూ.1,500 కోట్లను ఇటీవల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించటంతో ఈ నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో వీటిపై సర్కారు క్లారిటీ ఇవ్వనున్నది.
త్వరలో నమూనాలు ఫైనల్
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి రివ్యూ చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ల నిర్మాణానికి ఆర్కిటెక్చర్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా తరగతి గదులతోపాటు విద్యార్థులకు అన్ని వసతులుండేలా అధునాతన భవనాలు నిర్మించాలని సూచించారు. అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా నమూనాలు సిద్ధం
చేసుకోవాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్‌స్కూల్స్‌కు దీటుగా ఈ భవనాలు నిర్మించాలని ఆదేశించారు.