- సీఎం రేవంత్‌రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నియంత్రణ, గోసంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మాజీ మంత్రి, జంతు సంరక్షణ కార్యకర్త మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో గో సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా ఎన్కేపల్లిలో విశాలమైన ప్రదేశంలో, అత్యాధునిక సౌకర్యాలతో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేసిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల సమీపంలో గో శాలలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మేనకా గాంధీకి వివరించారు. వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జంతువుల సంరక్షణకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వ తీరును మేనకా గాంధీ కొనియాడారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
