
హైదరాబాద్, వెలుగు:
‘‘ఆర్టీసీ కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు. డ్యూటీలకు రాకుండా, వారి ఇష్టమొచ్చినప్పుడు డ్యూటీల్లో చేరతామనడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ప్రక్రియ అంతా ముగిసే వరకు కార్మికులను డ్యూటీల్లో చేర్చుకోవడం కుదరదు’’ అని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ తేల్చిచెప్పారు. మంగళవారం నుంచి డ్యూటీల్లో చేరతామంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఓవైపు పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి డ్యూటీల్లో చేరతామంటున్నారని, దీన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై సోమవారం సీఎం కేసీఆర్ సమీక్ష జరిపిన అనంతరం సునీల్ శర్మ ఈ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దీన్ని మీడియాకు పంపారు. మంగళవారం డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం క్షమించదని కార్మికులకు సునీల్ శర్మ హెచ్చరించారు. బస్సులు నడుపుతున్న టెంపరరీ డ్రైవర్లను, టెంపరరీ కండక్టర్లను అడ్డుకోవద్దన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తప్పవని పేర్కొన్నారు. అంతేకాక ఇదే విషయాన్ని హైకోర్టుకు కూడా తెలియజేస్తామన్నారు. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
సమ్మె చేయాలని మేం చెప్పలేదే
ఆర్టీసీ కార్మికులు వాళ్లంతట వాళ్లే డ్యూటీలకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారని సునీల్ శర్మ పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ సమ్మె చేయాలని చెప్పలేదని సునీల్ శర్మ వ్యాఖ్యానించారు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని ఆయన మండిపడ్డారు.
సునీల్ శర్మ తెలుగు సంతకం
సమ్మె విరమణపై కార్మికులు ప్రకటన చేసిన కాసేపటికే ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ ప్రెస్ రిలీజ్ ఆసక్తి రేపింది. సునీల్ శర్మ సంతకంతో ఉన్న ఈ నోట్ సీఎం ఆఫీస్ నుండి విడుదలైంది. తెలుగులో టైప్ చేసిన మూడు పేజీల నోట్ చివరిలో ఇన్చార్జి ఎండీని ‘ఎండీ, టీఎస్ ఆర్టీసీ’ అంటూ బ్లాక్ ఇంక్ తో రాశారు. దానిపై సునీల్ శర్మ బ్లూ ఇంక్ తో తెలుగులో సంతకం చేసి డేట్ వేశారు. ఆయన తెలుగు సంతకం ఆర్టీసీ వర్గాల్లోనే చర్చకు దారితీసింది. సునీల్ శర్మకు తెలుగు మాట్లాడడం వచ్చినా, తెలుగులో సంతకం చేయడం మాత్రం ఎప్పుడూ చూడలేదని వాళ్లు చెబుతున్నారు.
ఇష్టమొచ్చినప్పుడు డ్యూటీలకు రావడం, మానేయడం అనేది దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఉండదని తెలిపారు. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం సమ్మె విషయంలో కార్మిక శాఖ తగు నిర్ణయం తీసుకుంటుందని, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్టీసీ మేనేజ్మెంట్ తదుపరి చర్యలు చేపడుతుందన్నారు. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుందని తెలిపారు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారని, ఇక ముందు కూడా వారి మాటలు విని మరిన్ని నష్టాలు కొని తెచ్చుకోవద్దన్నారు. ‘‘హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు.. కార్మికులను డ్యూటీల్లో చేర్చుకోవడం చట్టం ప్రకారం సాధ్యం కాదు. లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలి” అని ఆయన
సూచించారు.
సమ్మె విరమణ పత్రాలను తీసుకోని ఆఫీసర్లు
సమ్మె విరమిస్తున్నట్టు తెలిపేందుకు ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ వద్దకు వెళ్లిన ఆర్టీసీ జేఏసీ నాయకులకు నిరాశ ఎదురైంది. సోమవారం సాయంత్రం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత వారు బస్ భవన్, ఎర్రమంజిల్‌లోని ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ కార్యాలయాలకు వెళ్లారు. రెండుచోట్ల సమ్మె విరమణ పత్రాన్ని తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. అధికారుల తీరును జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి తీవ్రంగా ఖండించారు.