
- డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసేలా చర్యలు..
- మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్తూపం వరకు నాలుగు లేన్లుగా విస్తరణ
- రోడ్డు మధ్యలో డివైడర్లు, సెంట్రల్ లైటింగ్‌కు ఏర్పాట్లు
- మహాజాతర టైంలో ట్రాఫిక్ నియంత్రణకు సర్కార్ నిర్ణయం
- మేడారం వచ్చే అన్ని రోడ్లకూ రిపేర్లు చేపట్టనున్న ప్రభుత్వం
- ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే టెండర్లు పూర్తి
హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లా మేడారంలో ప్రధాన రోడ్డు విస్తరణతో పాటు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మేడారం కోర్ ఏరియా పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి జంపన్నవాగు మీదుగా స్థూపం వరకు ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ పనుల కోసం రూ.27.5 కోట్లను కేటాయించగా.. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు. అలాగే మేడారం మహాజాతరను పురస్కరించుకొని జాతరతో లింక్ ఉన్న ప్రతీ రోడ్డును బాగు చేయనున్నారు. ఈ రోడ్లపై ఉన్న లోలెవల్ బ్రిడ్జిల స్థానంలో హై లెవెల్ వెంతెనలు కట్టనున్నారు. ఇందుకోసం మరో రూ.45 కోట్లను కేటాయించారు. వీటితో పాటు మరో రూ.18.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రోడ్లు భవనాల శాఖ శ్రీకారం చుట్టింది. ఈ పనులన్నింటినీ డిసెంబర్ 31 నాటికి కంప్లీట్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
నాలుగు లేన్లుగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్తూపం రోడ్డు
మేడారం మహాజాతర జరిగే నాలుగు రోజుల్లోనే కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. ఆ నాలుగు రోజుల్లో మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్, జంపన్నవాగు మీదుగా స్తూపం వరకు ఉన్న రెండు వరుసల రోడ్డుపై ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తుంటారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రోడ్డుపై జాతర టైంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది.
వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా హెల్త్ క్యాంప్‌తో పాటు ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్, రెవెన్యూ, పోలీసుల క్యాంప్ ఆఫీస్‌లన్నీ ఈ రోడ్డుకి ఇరువైపులే ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారు సైతం ఇదే రోడ్డులో గద్దెల వద్దకు చేరుకుంటారు. పగిడిద్దరాజు, గోవిందరాజులతో పాటు కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలుకలగుట్ట నుంచి వచ్చే సమ్మక్కను కూడా ఈ రోడ్డు గుండానే తీసుకొచ్చి గద్దెలపైకి చేరుస్తుంటారు.
ప్రస్తుతం ఈ రోడ్డు రెండు వరుసలే ఉండడం, మధ్యలో డివైడర్లు సైతం లేకపోవడంతో భక్తుల రద్దీ, తోపులాట ఎక్కువగా ఉంటుంది. జాతర టైంలో ఈ రోడ్డు గుండా అంబులెన్స్‌లు, పోలీస్ ఎస్కార్ట్ వెహికల్స్, వీఐపీ, వీవీఐపీ వెహికల్స్ సైతం ఫ్రీగా తిరగలేవు. ఈ సమస్యను పరిష్కరించాలని భావించిన సర్కార్ 2026 మహాజాతర టైం వరకు ఓ రోడ్డును వెడల్పు చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు వరుసలు ఉన్న ఈ రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించడంతో పాటు మధ్యలో డివైడర్లు నిర్మించి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనుంది. అలాగే భవిష్యత్ అవసరాలరీత్యా రోడ్డుకు ఇరువైపులా రెండు మీటర్ల వెడల్పుతో మురుగు కాల్వలు సైతం నిర్మించనుంది. రూ.27.5 కోట్లతో చేపట్టే పనులకు ఇప్పటికే ఆర్‌అండ్‌బీ శాఖ ఆఫీసర్లు టెండర్లు పిలిచారు.
రూ.91 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరుగనుంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి మేడారం వచ్చే వాహనాలకు ఇబ్బందులు కలగకుండా రోడ్లు బాగుచేసే పనిలో ఆర్‌అండ్‌బీ శాఖ నిమగ్నమైంది. ఇందులో భాగంగా రూ.12 కోట్లతో ఇల్లందు–పాకాల మధ్యన ఉన్న 1.5 కిలోమీటర్ల రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు.
రూ.1.30 కోట్లతో తాడ్వాయి–నార్లాపూర్ మధ్యన ఉన్న నాలుగు లోలెవల్ వంతెనల స్థానంలో హైలెవల్ బ్రిడ్జిలు కట్టనున్నారు. అలాగే రూ.1.50 కోట్లతో భూపాలపల్లి – పస్రా రోడ్డుపై మొట్లగూడెం వద్ద మైనర్ బ్రిడ్జి, రూ.4 కోట్లతో భూపాలపల్లి–పస్రా రోడ్డుపై 22.810 కిలోమీటర్ దగ్గర లోలెవల్ కాజ్‌వేను హైలెవల్ బ్రిడ్జిగా మార్చనున్నారు.
ఈ పనులతో పాటు మేడారం సెంట్రల్ లైటింగ్‌వర్క్స్ కు మొత్తం రూ.46.30 కోట్లు రిలీజ్ చేస్తూ సెప్టెంబర్ 19న ఆర్‌అండ్‌బీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి నుంచి పస్రా మధ్య దెబ్బతిన్న 40 కిలోమీటర్ల రోడ్డును బాగు చేసేందుకు రూ. 25 కోట్లు, భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ నుంచి ములుగు జిల్లా గాంధీనగర్ వరకు 23 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డును బాగు చేసేందుకు రూ.20 కోట్లను కేటాయిస్తూ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ గత నెల 27న జారీ చేయగా.. అన్ని పనులకు ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్లు పిలిచింది.
డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి చేస్తాం
మేడారం మహా జాతర జనవరి 28న ప్రారంభం కానుంది. అంతకు నెల రోజుల ముందే అన్నీ రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులకు కంప్లీట్ చేస్తాం. కల్వర్టులు, హైలెవల్ బ్రిడ్జిలు నిర్మిస్తాం. మేడారంలో సెంట్రల్ లైటింగ్ పనుల టెండర్ ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.
మోహన్ నాయక్, ఆర్‌అండ్‌బీ శాఖ ఈఎన్‌సీ, హైదరాబాద్