తుమ్మిడిహెట్టిపై ముందుకే! బ్యారేజీ సైట్ వద్ద మరోసారి సర్వేకు కసరత్తులు

తుమ్మిడిహెట్టిపై ముందుకే! బ్యారేజీ సైట్ వద్ద మరోసారి సర్వేకు కసరత్తులు
  • ఇప్పటికే 71 కిలో మీటర్ల కాల్వల నిర్మాణం పూర్తి
  • మళ్లీ పనులు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసే యోచనలో సర్కార్

హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి బ్యారేజీపై సర్కారు ఫోకస్ పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవితవ్యం సందిగ్ధంలో పడడంతో.. ఉమ్మడి ఏపీలో తలపెట్టిన తుమ్మిడిహెట్టినే సరైన ప్రత్యామ్నాయం అని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. 

ఇప్పటికే 71 కిలో మీటర్ల మేర కాల్వల నిర్మాణం కూడా పూర్తవ్వడంతో ఒకే లిఫ్ట్ తో నీటిని ఎల్లంపల్లికి తరలించవచ్చని భావిస్తున్నది. ఈ క్రమంలోనే వీలైనంత తొందరగా తుమ్మిడిహెట్టిపై ముందడుగు వేసేందుకు సర్కారు దృష్టి సారించినట్టు చెప్తున్నారు. అందులో భాగంగా మరోసారి తుమ్మిడిహెట్టి వద్ద సర్వే చేయించి ముందుకు వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

ఇప్పటికే ఉన్న నెట్​వర్క్​ను వాడుకునే వెసులుబాటు

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మిస్తే ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ నెట్​వర్క్​ను వాడుకుని నీళ్లిచ్చేందుకు వెసులుబాటు ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించిన్నప్పటి నుంచి దానివల్ల ప్రయోజనం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎకరాకు లక్షన్నర ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకూ నీళ్లివ్వలేని పరిస్థితి ఏర్పడిందన్న వాదన ఉన్నది. 

ఈ నేపథ్యంలోనే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని నిర్మిస్తే ఆయకట్టుకు ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టుకు తొందరగా ముహూర్తం ఫిక్స్ చేస్తే పూర్తి చెయ్యొచ్చన్న చర్చ నడుస్తున్నది. తుమ్మిడిహెట్టిపై దృష్టి సారిస్తూనే సమాంతరంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకూ రిపేర్లు చేయించేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది.