రోడ్లు, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో సాయం అందించాల్సిందిగా ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టులో కూడా ఏడీబీ భాగస్వామ్యం లేదని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) మేనేజింగ్ డైరెక్టర్ ఈ వీ నరసింహా రెడ్డి చెప్పారు. ఏడీబీ ఫండెడ్ ప్రాజెక్టులలో బిజినెస్ అవకాశాలపై ఎఫ్‌టీసీసీఐ నిర్వహించిన సెమినార్‌లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో మెరుగైన ఎకో సిస్టమ్ ఉందని చెబుతూ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని మేజర్ ప్రాజెక్టులను నరసింహా రెడ్డి వివరించారు.హైదరాబాద్–వరంగల్ మధ్య, హైదరాబాద్–నాగ్‌పూర్ మధ్య తలపెడుతున్న ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులలో భాగం పంచుకోవల్సిందిగా ఏడీబీని ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు ఈ రెండు ప్రాజెక్టుల మీదా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తున్నట్లు నరసింహా రెడ్డి వెల్లడించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు నిధులు అందించే విధానాలను, అనుసరించే నియమ నిబంధనలనూ ఏడీబీ సీనియర్ ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్ చంద్ర మోహన్ అరోరా వివరించారు. ఏడీబీ ప్రిన్సిపల్ ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్ట్ బిస్మా హుసెన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ సోమేష్ కుమార్ కూడా సెమినార్‌లో పాల్గొన్నారు.
