
హైదరాబాద్, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ గురువారం ప్రకటించింది. ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను వీఎస్టీలోని ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్‌లో జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి, కన్వీనర్ వీఎస్ రావు విడుదల చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని, సమస్యలపై మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదని జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి అన్నారు. రెండు పీఆర్సీలు, 2012 పీఆర్సీ బాండ్లు, డీఏ బకాయిలు, సీసీఎస్‌కు ఆర్టీసీ ఇవ్వాల్సిన రూ.1,075 కోట్లు, పీఎఫ్ ట్రస్ట్‌కు రూ.1,200 కోట్లు, రిటైర్ కార్మికులకు చెల్లించాల్సిన సెటిల్మెంట్లపై ప్రభుత్వం నోరుమెదపడం లేదని విమర్శించారు.
ఎస్బీటీ, ఎస్ఆర్బీ వంటి ఎన్నో సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నెల రోజుల్లో విలీనం ప్రాసెస్ పూర్తవుతుందని మంత్రి అజయ్ ప్రకటించారని, ఈ క్రమంలో వీలైనంత త్వరగా అన్ని సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి ప్రకటన చూస్తుంటే.. ఏకపక్షంగా విలీనం ప్రాసెస్ పూర్తి చేస్తారనే అనుమానం కలుగుతున్నదని విమర్శించారు. ఆర్టీసీలో పని చేస్తున్న 43వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు ఈ బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. విలీనం సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారుల కమిటీ అన్ని యూనియన్ల నుంచి వినతిపత్రాలు తీసుకోవాలన్నారు. అధికారుల కమిటీలో యూనియన్ ప్రతినిధికి చోటు కల్పించాలని కోరారు. విలీనంకు సంబంధించి మొత్తం 80 అంశాలపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు.