ప్రాజెక్టుల కోసం మరో వెయ్యి కోట్ల అప్పు

ప్రాజెక్టుల కోసం మరో వెయ్యి కోట్ల అప్పు

హైదరాబాద్‌‌, వెలుగు: ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల కోసం మరో రూ.వెయ్యి కోట్ల అప్పు తీసుకునేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతోంది. బ్యాంక్‌‌ ఆఫ్ మహారాష్ట్ర నుంచి లోన్‌‌ తీసుకునేందుకు అనుమతిస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. దేవాదుల, సీతారామ లిఫ్ట్‌‌ స్కీమ్​లు, వరద కాలువ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. అలాగే ఈ ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాటాను కుదిస్తూ మరో జీవో ఇచ్చింది. తద్వారా ఆయా ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాటా మొత్తాన్ని లోన్ల రూపంలోనే సమకూర్చడానికి రంగం సిద్ధం చేసింది. వాటర్‌‌ రీసోర్సెస్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌‌ ద్వారా రూ.వెయ్యి కోట్ల లోన్‌‌ తీసుకోనున్నారు. సీతారామ లిఫ్ట్‌‌ స్కీంకు రూ.470 కోట్లు, దేవాదుల ఎత్తిపోతల, వరద కాలువకు రూ.265 కోట్ల చొప్పున అప్పు తీసుకోనున్నారు. ఈ మొత్తానికి ఏటా 8.95 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరద కాలువ, దేవాదుల ఎత్తిపోతల పథకం 2022 ఏప్రిల్‌‌ ఒకటి నాటికి, సీతారామ లిఫ్ట్‌‌ 2023 ఏప్రిల్‌‌ ఒకటి నాటికి కమర్షియల్‌‌ ఆపరేషన్‌‌లోకి వస్తాయని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి తీసుకున్న అప్పు 14 ఏండ్లలో, మిగతా రెండు ప్రాజెక్టుల లోన్‌‌ 13 ఏండ్ల రీపేమెంట్‌‌ చేస్తామన్నారు. 

రూ.39 వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం
సీతారామ ఎత్తిపోతలు రూ.13,058 కోట్లు, వరద కాలువ రూ.10,953 కోట్లు, దేవాదుల రూ.13,445 కోట్లు, తుపాకులగూడెం ప్రాజెక్టులను రూ.2,121 కోట్లతో చేపట్టారు. 2018 మార్చి 31 నాటికి రూ.15,647 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. మిగతా రూ.23,931 కోట్లలో రూ.7,364 కోట్లు రూరల్‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌ కార్పొరేషన్‌‌ (ఆర్‌‌ఈసీ) నుంచి, రూ.6,750 కోట్లు ఆంధ్రా బ్యాంకు (ప్రస్తుత యూనియన్‌‌ బ్యాంక్‌‌) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి లోన్ తీసుకునేందుకు ఇప్పటికే సర్కార్ అనుమతి ఇచ్చింది. మిగిలిన రూ.9,817 కోట్లు ప్రభుత్వ వాటా (మార్జిన్‌‌ మనీ)గా సమకూర్చాల్సి ఉంది. అయితే ఆర్‌‌ఈసీ నుంచి తీసుకున్న లోన్‌‌ రూ.2,638 కోట్లు, తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణంలో వ్యయం తగ్గిందని పేర్కొంటూ రూ.248 కోట్లను మార్జిన్‌‌ మనీ నుంచి ఆ మొత్తాన్ని తగ్గించిన ప్రభుత్వం.. తాజా ఉత్తర్వుల్లో సర్కార్ వాటాను రూ.6,931.27 కోట్లుగా పేర్కొంది. మార్జిన్‌‌ మనీగా పేర్కొన్న ఈ మొత్తమైనా ప్రభుత్వం సమకూరుస్తుందా? దీన్ని కూడా లోన్లతో సర్దుబాటు చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవాదుల, వరద కాలువ ప్రాజెక్టులను 2022 ఏప్రిల్‌‌ ఒకటి నాటికి, సీతారామ ఎత్తిపోతలను 2023 ఏప్రిల్‌‌ ఒకటి నాటికి పూర్తి చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తద్వారా ఆయా ప్రాజెక్టులకు తీసుకున్న రుణాల రీపేమెంట్‌‌ షెడ్యూల్‌‌ను సవరించారు. 

లోన్‌‌ గ్రౌండింగ్‌‌కు గెజిట్‌‌ మెలిక
బ్యాంక్‌‌ ఆఫ్‌‌ మహారాష్ట్ర నుంచి రూ.వెయ్యి కోట్ల లోన్‌‌ తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఆ మొత్తం గ్రౌండింగ్‌‌ కావడానికి గెజిట్‌‌ మెలిక పెట్టింది. కేంద్రం గోదావరి రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు (జీఆర్‌‌ఎంబీ) పరిధిని నిర్ధారిస్తూ జులై 15న నోటిఫికేషన్‌‌ జారీ చేసింది. అక్టోబర్‌‌ 14 నుంచి ఇది అమల్లోకి రావాల్సి ఉంది. గెజిట్‌‌ అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోగా ప్రాజెక్టులకు పర్మిషన్‌‌లు తప్పనిసరి. ఒకవేళ పర్మిషన్‌‌లు రాకుంటే ఆయా ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు లోన్‌‌ ఇచ్చే ముందు లీగల్‌‌ ఒపీనియన్‌‌ తీసుకుని, దాని ఆధారంగా ముందుకు వెళ్లే వెసులుబాటు కల్పించారు. ఇదే విషయాన్ని ఉత్తర్వుల్లో 
ప్రముఖంగా ప్రస్తావించారు. 

జీవోల తొలగింపు... 
సీతారామ, దేవాదుల, వరద కాలువలకు లోన్‌‌ తీసుకునేందుకు అనుతిస్తూ జారీ చేసిన జీవో, ప్రాజెక్టుల కమర్షియల్‌‌ ఆపరేషన్‌‌ గడువును పొడిగిస్తూ జారీ చేసిన జీవోను ప్రభుత్వం వెబ్‌‌సైట్‌‌ నుంచి తొలగించింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత ‘‘గవర్నమెంట్‌‌ ఆఫ్‌‌ తెలంగాణ.. గవర్నమెంట్‌‌ ఆర్డర్‌‌ ఇష్యూ రిజిస్టర్‌‌’’ వెబ్‌‌ సైట్‌‌ లో పెట్టిన 419, 420 జీవోలను.. సాయంత్రానికి తొలగించారు. గతంలో ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు సంబంధించిన అన్ని జీవోలు అప్‌‌లోడ్‌‌ చేసేవారు. ముఖ్యంగా ప్రాజెక్టుల రివైజ్డ్‌‌ ఎస్టిమేట్లకు సంబంధించిన ఉత్తర్వులన్నీ వెబ్‌‌సైట్‌‌లో పెట్టేవారు. కాగా, కొన్ని నెలలుగా ముఖ్యమైన ఉత్తర్వులను బయటపెట్టడం లేదు.