త్వరలో కొత్త విద్యుత్ పాలసీ: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

త్వరలో కొత్త విద్యుత్ పాలసీ: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
  • రాబోయే రోజుల్లో పరిశ్రమలకు ఇబ్బంది ఉండదు

  • పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్

  • బ్యాంకర్లకు పాజిటివ్ దృక్పథం ఉండాలె

  •  రైతుల రుణమాఫీ చేసి తీరుతం

  •  ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతం

  • ఐదేండ్లలో మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు

  • బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త విద్యుత్ పాలసీని ప్రవేశపెట్టనుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాబోయే రోజుల్లో  పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు.  ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  బ్యాంకర్లకు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం కూడా అభివృద్ది చెందదని అన్నారు. నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  రీజినల్ రింగ్ రోడ్డు రాకతో తెలంగాణ రూపు రేఖలు మారిపోతాయని చెప్పారు. 

వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్దితో తెలంగాణ.. దేశంతో పోటీ పడనుందని అన్నారు. అప్పులు చేసి సంపద సృష్టిస్తామని, దానికి సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.  వ్యవసాయం, ఫార్మా, స్థిరాస్తి రంగాలకు త్వరితగతిన రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆయన కోరారు.  వ్యవసాయ రంగానికే రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. వ్యాపార రంగం అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర అని అన్నరు. బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణ పరిమితిని సాధించడం సంతోషకరమన్నారు. 

దేశంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని అన్నారు.  వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అర్బన్‌, సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు డిమాండ్‌ రాబోతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు  ప్రాధాన్యమిస్తామని విక్రమార్క వివరించారు.

ఆయిల్‌పామ్‌ సాగుకు సహకరించాలె:  వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగుకు బ్యాంకర్లు సహకరించాలని  మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు.  ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించినట్లు  తెలిపారు. ప్రతి జిల్లాలో ఆయిల్‌ పామ్‌ పండిస్తున్నారని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలని తెలిపారు. దశాబ్దాలుగా రైతే రాజు అంటున్నామని, కానీ బ్యాంకు గణాంకాలు చూస్తే భయం వేస్తోందని పేర్కొన్నారు. బహుళజాతి, ఇన్‌ఫ్రా కంపెనీలకు వేల కోట్ల రూపాయిలు  రుణాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి మాత్రం బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయన్నారు. పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయం ఉండకూడదని చెప్పారు. నిబంధనల ప్రకారమే బ్యాంకర్లు వ్యవహరించాలని సూచించారు