ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్/మంచిర్యాల/ ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలకు కలలతో విడదీయలేని బంధం ఉందని, తెలంగాణ  ఉద్యమంలో  కవులు, కళాకారులు  నిర్వహించిన  పాత్ర అనిర్వచనీయమని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక  దివ్య గార్డెన్ లో  జాతీయ  సమైక్యత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరై కవులు, కళాకారులు, పోరాటయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళాకారులతో కలిసి మంత్రి డోలు వాయించారు.  కలెక్టర్  ముషారఫ్ అలీ ఫారుఖీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అడిషనల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

అలరించిన ప్రదర్శనలు

మంచిర్యాలలోని హైలైఫ్​ ఆడిటోరియంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విద్యార్థులు దేశ సమైక్యతను, సమగ్రతను చాటేలా ప్రదర్శనలు ఇచ్చారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, కలెక్టర్​ భారతి హోళికేరి, మున్సిపల్​ చైర్మన్​ పెంట రాజయ్య, వైస్​ చైర్మన్​ ముఖేశ్​​గౌడ్​తో పాటు పలువురు అధికారులు కుటుంబసభ్యులతో హాజరై ప్రదర్శనలను తిలకించారు. 

ఆసిఫాబాద్​లో..

జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్క్ లో నిర్వహించిన సమైక్యతా వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాలకు అడిషనల్ కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయ్, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి లతో కలిసి కలెక్టర్​రాహుల్​రాజ్​ హాజరయ్యారు. ఈ సందర్భంగా  స్వాతంత్ర్య సమరయోధులు, వివిధ రంగాల కళాకారులను సన్మానించారు.  

ఉట్నూర్​లో కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  సీఎం కేసీఆర్​ మాటలకు నిరసనగా ఆదివారం తుడుందెబ్బ నాయకులు ఉట్నూర్​ కొమరం భీం కాంప్లెక్స్​ ముందు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్​ దేశంలో ఉన్న లంబాడీలందరినీ ఒకే గూటికి చేర్పించి రిజర్వేషన్ కల్పిస్తాననడంపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన రిజర్వేషన్ల వల్ల ఆదివాసీలకు ఒరిగేది లేదని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్లు మహారాష్ర్ట నుంచి వలస వచ్చిన లంబాడీలు కొల్లగొడుతున్నారన్నారు. వెంటనే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. 

వెదురు కళాకారులను ఆదుకుంటాం

నిర్మల్/ ఆసిఫాబాద్/ జన్నారం, వెలుగు: వెదురు కళాకారులను ఆదుకుంటామని, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఆదివారం ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్​లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వెదురు కళాకారులను  సన్మానించారు.   

మేదరుల సమస్యల పరిష్కారం కోసం కృషి

మేదరులు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆసిఫాబాద్​కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్క్ లో ఆదివారం నిర్వహించిన ప్రపంచ వెదురు ఉత్సవానికి కలెక్టర్​హాజరయ్యారు . మేదరులు వెదురుతో అల్లిన అల్లిక లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరూ కులవృత్తిని వదులుకోవద్దని భవిష్యత్ తరాలకు ప్రస్తుత తరం వారు వారధిగా ఉండాలని సూచించారు. అడిషనల్  కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయ్ , మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు  కనకయ్య తదితరులు పాల్గొన్నారు. 

జన్నారంలో..

మేదర కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్  అన్నారు. ఆదివారం  వెదురు దినోత్సవం సందర్భంగా జన్నారంలో  మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో మేదరులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహేంద్ర భవన్ లో  మేదరులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.   

ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య

బెల్లంపల్లి, వెలుగు:  ప్రేమ విఫలమైందని మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.  రైల్వే హెడ్​ కానిస్టేబుల్​ సంపత్​ వివరాల ప్రకారం.. బెల్లంపల్లి మండలం.. గురజాల గ్రామ పరిధిలోని లంబాడి తండాకు చెందిన ఉప్పల వంశీ కృష్ణ (25) హైదరాబాద్ లో ఓ ప్రైవేట్​కంపెనీలో జాబ్​చేస్తున్నాడు. తన గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించాడు. విషయం యువతి తరఫు పెద్దలకు తెలిసి హెచ్చరించడంతో మనస్తాపం చెంది.. శనివారం రాత్రి  బెల్లంపల్లి పట్టణంలోని రైల్వేస్టేషన్ కు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయాడు. తీవ్ర గాయాలైన యువకుడిని రైల్వే పోలీసులు, కుటుంబ సభ్యులు చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  రైల్వే హెడ్​ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు.

బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్

నిర్మల్, వెలుగు:  బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా గొల్లపల్లి  శ్రీనివాస్ గౌడ్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక ఓ ప్రైవేట్​స్కూల్​లో  రాష్ట్ర  బాస్కెట్ బాల్  ప్రధాన కార్యదర్శి నార్మల్ ఐజాక్  ఆధ్వర్యంలో  ఎన్నికలు నిర్వహించారు. కాగా అసో సియేషన్  జిల్లా ప్రధాన కార్యదర్శిగా బండి డేవిడ్ బెనహర్, ఉపాధ్యక్షులుగా పోశెట్టి, నఫియా ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ గా సత్యనారాయణ, ట్రెజరర్ గా  సత్తయ్య, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా షేక్ ఇమ్రాన్, వాసుదేవా రెడ్డి, సామ్యూల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గ్లాడ్  స్టోన్  నవీన్, ప్రేమలత, వెన్నెల ఎన్నికయ్యారు.  నిర్మల్​ డీఎస్పీ జీవన్ రెడ్డి, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు  భూమయ్య, హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు  రామచందర్, సోన్ జడ్పీటీసీ మెంబర్ జీవన్ రెడ్డి, కోకో అసోసియేషన్ బాధ్యుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు కార్మికులను పట్టించుకోని ఎమ్మెల్యేలు

మందమర్రి, వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికుల వేతనాల పెంపు, ఇతర  సమస్యలను  పరిష్కరించేందుకు కోల్​బెల్ట్​ ఎమ్మెల్యేలు చొరవ చూపడం లేదని కాంట్రాక్ట్​ కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు ఆరోపించారు. ఆదివారం  మందమర్రి సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో వారు మీడియాతో మాట్లాడారు. సింగరేణి  వ్యాప్తంగా పది రోజులుగా కార్మికులు నిరవధిక సమ్మె చేస్తుంటే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు  కనీసం కార్మికులకు మద్దతు కూడా ప్రకటించలేదన్నారు. సీఎం దృష్టికి  తీసుకుళ్లేందుకు ప్రయత్నిస్తే  అక్రమంగా అరెస్టులు, నిర్బంధాలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.  

రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి

బజార్ హత్నూర్, వెలుగు: మండల  కేంద్రానికి చెందిన  యువ చైతన్య ,  భజరంగ్​దళ్ మండల అధ్యక్షుడు బత్తిని సాయి కృష్ణ బర్త్​డే సందర్భంగా ఆదివారం ఛత్రపతి శివాజీ మహరాజ్ సేన ఆధ్వర్యంలో ఫ్రెండ్స్​, యూత్​మెంబర్లు 40 మంది స్వచ్ఛందంగా రక్త దానం చేశారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ తన బర్త్​ డే సందర్భంగా తన ఫ్రెండ్స్  ధనుంజయ్, నగేశ్, కల్యాణ్​తో పాటు పలువురు రక్తదానం చేయడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. 

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో కేసీఆర్​కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని బేజేపీ రాష్ట్ర నాయకురాలు, జడ్పీ మాజీ చైర్​పర్సన్​ సుహాసిని రెడ్డి అన్నారు. ఆదివారం క్రాంతి నగర్ కాలనీ లో పెద్ద ఎత్తున యువకులు, కాలనీవాసులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని  విమర్శించారు. అందుకే కాలనీల్లో బీజేపీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే కాలనీవాసులు రాకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. 

మొద్దు నిద్రలో తెలంగాణ ప్రభుత్వం

కాగ జ్ నగర్, వెలుగు:  ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చింతల మానేపల్లి మండలం దిందా గ్రామంలోని వాగుపై  బ్రిడ్జి నిర్మించాలని వాగు ఒడ్డున గ్రామస్తులు చేస్తున్న నిరసన దీక్షకు ఆదివారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దిందా గ్రామస్తులు తమ సమస్య పరిష్కరించాలని ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూడకపోవడం బాధాకరమన్నారు.  గ్రామం నుంచి బయటకు వెళ్లేందుకు  రోడ్డు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే కోనప్ప ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.  బీజేపీ చింతల మానే పల్లి మండల అధ్యక్షుడు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌడ్, జిల్లా యువ మోర్చా కార్యదర్శి సంజీవ్, పురుషోత్తం చారి తదితరులు పాల్గొన్నారు.

నిజాం ను సీఎం పొగడడం సిగ్గు చేటు

బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య 

నిర్మల్/ఆదిలాబాద్​టౌన్​/ కాగజ్​నగర్, వెలుగు: జాతీయ సమైక్యతా ఉత్సవాల్లో  నిజాంను  సీఎం కేసీఆర్ పొగుడుతూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిర్మల్​లో స్థానిక  చైన్ గేట్ వద్ద గల  కొమురం భీమ్, రాంజీ గోండ్ విగ్రహాల వద్ద బీజేపీ లీడర్లు నల్లజెండాలతో  నిరసన తెలిపారు.   ఆదిలాబాద్​ పట్టణంలోని  శంకర్​ పిలుపు మేరకు నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్​వ్యాఖ్యలు తెలంగాణ సమాజానికే సిగ్గుచేటని మండిపడ్డారు.  బీజేపీ పార్లమెంట్​కన్వీనర్​అయ్యన గారి భూమయ్య, డాక్టర్​మల్లికార్జునరెడ్డి , కాగజ్​నగర్​లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

పోలీసుల నిఘా వైఫల్యం వల్లే పీఎఫ్​ఐ కార్యకలాపాలు

ఆదిలాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలో పీఎఫ్ఐ కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఎన్ఐఏ ఆఫీసర్లు వచ్చి తనిఖీలు చేసేంత వరకు ఇక్కడి పోలీసులకు తెలియకపోవడం నిఘా వైఫల్యమేనని బీజేపీ నేత ఎన్రాల నగేశ్​విమర్శించారు. ఆదివారం పార్టీ ఆఫీసులో  ప్రెస్​మీట్​లో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో పాకిస్తాన్​ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని బీజేపీ ముందే హెచ్చరించిందని, అయినా  పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారిని వదిలేసి, బీజేపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ లీడర్లు లాలా మున్న, దినేశ్ మటోలియ, జోగు రవి, ముకుంద్ విజయ్ పాల్గొన్నారు. 

అదనపు కట్నం తేవాలని భర్త  చిత్రహింసలు

మీడియా సమావేశంలో ఓ గర్భిణి ఆవేదన

బెల్లంపల్లి, వెలుగు: అదనపు వరకట్నం తేవాలని తన భర్త  చిత్ర హింసలు పెడుతూ.. చంపాలని చూస్తున్నాడని   ఓ గర్భిని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆకెనపల్లి గ్రామానికి చెందిన ఎగ్గె నవీన ఆదివారం బెల్లంపల్లి ప్రెస్​క్లబ్​లో  మీడియాతో మాట్లాడారు. తనకు ఎగ్గె తిరుపతితో పదేండ్ల కింద పెళ్లైందని, పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు కట్న కానుకలతో పాటు ఎకరం పొలం ఇచ్చారని చెప్పారు. అయితే ఒక కొడుకు, కూతురు పుట్టిన తర్వాత  తన భర్త  రూ.5లక్షలు అదనపు కట్నం  తేవాలని వేధిస్తున్నాడని.. దీంతో కొంత కాలంగా తన తల్లి వద్ద  ఉంటున్న తనపై తిరుపతి దాడి చేసి  హత్య చేసేందుకు యత్నించాడని నవీన చెప్పారు.  ఇదే విషయంపై  3 నెలల కింద తాళ్ల గురిజాల పీఎస్​లో పోలీసులకు కంప్లైంట్​చేసినా.. ఇప్పటికీ పోలీసులు తన భర్తపై కేసు పెట్టలేదని, తనకు న్యాయం చేయలేదని  ఆమె ఆరోపించారు. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. 

మోడీ బర్త్​డే  వారోత్సవాల్లో స్వచ్ఛంద కార్యక్రమాలు

నిర్మల్/తిర్యాణి, వెలుగు:  ప్రధాని మోడీ బర్త్​డే వారోత్సవాల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్​లో బీజేపీ లీడర్లు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పార్టీ  హెల్త్ విభాగం కన్వీనర్  డాక్టర్  మల్లికార్జున్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు  మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో  దాదాపు వెయ్యి మందికి పైగా టెస్టులు చేయించుకున్నారు.  లీడర్లు అలివేలు మంగ, శ్రావణ్ రెడ్డి, నారాయణ గౌడ్,  శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్​ జిల్లాలో..

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో  బీజేపీ లీడర్లు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తిర్యాణి మండలం పర్చకి గూడ నుంచి మర్కగూడ వరకు రోడ్డు బాగా లేకపోవడంతో ఆదివారం  ఆలయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నక్ విజయ్ కుమార్ మట్టి రోడ్డు వేయించారు.  బీజేపీ మండల అధ్యక్షుడు రమేశ్ గౌడ్, పులి వెంకటేశ్, శ్రీధర్, మురళి పాల్గొన్నారు.  

బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి స్పష్టం చేయాలి

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు పార్లమెంట్​కు డా.అంబేడ్కర్​ పేరు పెట్టడంపై వారి వైఖరి స్పష్టం చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్​ చేశారు. ఆదివారం కేఆర్​కే, పిట్టలవాడ కాలనీల్లో రూ.85 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో పార్లమెంట్​కు  అంబేద్కర్​పేరు పెట్టాలని ప్రస్తావిస్తుంటే బీజేపీ ఎమ్మెల్యేలు బయటికి వెళ్లారన్నారు.