‘సిమ్స్‌‌’ గా రామగుండం మెడికల్ కాలేజ్‌‌

‘సిమ్స్‌‌’ గా రామగుండం మెడికల్ కాలేజ్‌‌
  • సింగరేణి ఉద్యోగుల పిల్లలకు 7 సీట్లు రిజర్వ్‌‌
  • జీవో జారీ చేసిన సర్కార్.. అసంతృప్తిలో భూనిర్వాసితులు

హైదరాబాద్, వెలుగు: రామగుండం మెడికల్ కాలేజీని ఇక నుంచి సింగరేణి ఇన్ స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెడికల్ సైన్సెస్‌‌(సిమ్స్‌‌) అని పిలవాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. సిమ్స్‌‌లో 150 ఎంబీబీస్ సీట్లు ఉండగా, ఇందులో 7 సీట్లను సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కోటా కింద అడ్మిషన్ పొందదల్చుకున్న స్టూడెంట్స్‌‌, తమ తండ్రి సింగరేణిలో పనిచేస్తున్నట్టుగా ఆ సంస్థ ఎండీ నుంచి లెటర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే, సిమ్స్‌‌కు అనుబంధంగా ఉన్న హాస్పిటల్‌‌లో 50 బెడ్లను సింగరేణి కార్మికుల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్టు మరో మెమో జారీ చేశారు. 

మెడికల్ అడ్మిషన్లలో ఇదివరకు ఉన్న ఎన్‌‌సీసీ కోటాను ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వరకు అన్ని కాలేజీల్లో ఒక శాతం సీట్లను ఎన్‌‌సీసీ క్యాండిడేట్స్‌‌కు రిజర్వ్ చేసేవాళ్లు, ఇకపై ఈ సిస్టమ్ ఉండబోదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్‌‌సీసీ క్వాలిఫికేషన్‌‌ ఉన్న స్టూడెంట్స్‌‌కు, నీట్‌‌లో సాధించిన మార్కుల మీద కొంత వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్‌‌సీసీ బీ కేటగిరీ సర్టిఫికెట్ ఉన్నవారికి 3 శాతం, తలా సైనిక్ క్యాంప్, వాయు సైనిక్ క్యాంపు, నాయు సైనిక్ క్యాంపులో పాల్గొన్న వారికి 5 శాతం, రిపబ్లిక్‌‌ డే క్యాంపులో పాల్గొన్న వారికి 7 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

భూ నిర్వాసితులకు అన్యాయం

సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు మాత్రమే సిమ్స్‌‌లో రిజర్వేషన్లు కల్పించారు. రిటైర్డ్ కార్మికుల పిల్లలకు అవకాశం ఇవ్వలేదు. బొగ్గు గనుల కోసం భూములు, ఇండ్లు ఇచ్చి సింగరేణికి సహకరిస్తున్న నిర్వాసితుల పిల్లలకు కూడా మొండిచేయి చూపించారు. సింగరేణి కార్మికుల పిల్లలకు ఇచ్చినట్టే, తమ పిల్లలకు కూడా ఇంజనీరింగ్, మెడికల్ రిజర్వేషన్లు ఇవ్వాలని దశాబ్ద కాలంగా నిర్వాసితులు పెట్టుకున్న విజ్ఞప్తులను సర్కార్ తోసి పుచ్చింది. సింగరేణి హెడ్ క్వార్టర్స్‌‌ ఉన్న కొత్తగూడెంలో, బొగ్గు గనులు విస్తరించి ఉన్న మంచిర్యాల్, నిర్మల్, భూపాల్‌‌పల్లిలోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. రామగుండం కాలేజీతో పాటు వీటిల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.