‘గురునానక్, శ్రీనిధి’ స్టూడెంట్లకు ఊరట

‘గురునానక్, శ్రీనిధి’ స్టూడెంట్లకు ఊరట

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గుర్తింపు లేకుండా కొనసాగుతున్న గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీల్లోని స్టూడెంట్లకు ఊరట కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఆయా వర్సిటీల్లో చదువుతున్న 3 వేల మంది విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలని యోచిస్తోంది. శనివారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐదు ప్రైవేటు వర్సిటీల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపినా, గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. అయినా, 2022–23 విద్యాసంవత్సరానికి గాను గురునానక్ లో 2,800 వరకూ, శ్రీనిధిలో 300 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. అయితే విద్యాసంవత్సరం చివరి వరకూ వేచిచూసినా గవర్నర్ ఆమోదం తెలుపలేదు. దీంతో ఓ విద్యాసంవత్సరాన్ని కోల్పోవాల్సి రావడంతో విద్యార్థులు, పేరెంట్స్, విద్యార్థి సంఘాలు గురునానక్ వర్సిటీ వద్ద పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు.

సర్కారు పెద్దలతో పాటు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ నేపథ్యంలో ఈ వర్సిటీల్లో చదువుతున్న స్టూడెంట్లకు భరోసా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. దీంట్లో భాగంగా శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వారి కోర్సులను నిర్ణీత సమయంలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు వారి అకడమిక్ షెడ్యూల్ లో మార్పులు చేయాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు ప్రకటించి, విద్యార్థులకు న్యాయం చేస్తామని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అలాగే ఆ రెండు వర్సిటీలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.