అక్రమ టోల్ ప్లాజాలపై చర్యలు తీసుకోండి: హైకోర్టు ఆదేశం

అక్రమ టోల్ ప్లాజాలపై చర్యలు తీసుకోండి:  హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: అక్రమంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, టోల్ ప్లాజాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మానేరు నది పక్కన టోల్ ప్లాజా, చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మంథనికి చెందిన ఈ.సత్యనారాయణ 2022లో పిల్ దాఖలు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని తెలిపారు. 

సత్యనారాయణ వేసిన పిల్ ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది. పెద్దపల్లి జిల్లా ముతారం మండలం ఓడేడు గ్రామం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, గరిమిళ్లపల్లి గ్రామాల్లో చెక్ పోస్టు, టోల్ ప్లాజాలకు సంబంధించి పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్ పై విచారణను ముగించింది.