ఏపీపీలను ఎంత మందిని తొలగించారు ? వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఏపీపీలను ఎంత మందిని తొలగించారు ? వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్‌‌  ప్రభుత్వ హయాంలో నియమితులైన అదనపు పబ్లిక్‌‌  ప్రాసిక్యూటర్ (ఏపీపీ) లను కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎంత మందిని తొలగించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇంకా ఎంత మంది ఏపీపీలు పనిచేస్తున్నారు, వారి రిటైర్మెంట్‌‌ ఎప్పుడు అవుతుందో తదితర వివరాలను అందజేయాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. 

పూర్తి వివరాలను సమర్పించాలని సూచించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఎల్బీ నగర్‌‌  కోర్టులో పనిచేస్తున్న తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఏపీపీ పదవి నుంచి ప్రభుత్వం తొలగించిందంటూ అడ్వొకేట్‌‌  టి.వెంటేశ్వర ప్రసాద్, ఇతర కోర్టుల్లోని ఏపీపీలుగా చేసే మరో 12 మంది వేసిన పిటిషన్లను జస్టిస్‌‌ ఎన్‌‌వీ శ్రవణ్‌‌ కుమార్‌‌ సోమవారం విచారించారు.

ఏపీపీలుగా పనిచేస్తున్న పిటిషనర్లకు నోటీసు కూడా ఇవ్వకుండా తొలగిస్తూ ఈ నెల 10 జీవో జారీ చేయడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు. ఎందుకు తొలగిస్తున్నారో వివరించలేదని, తొలగింపునకు ముందు పిటిషనర్ల వివరణ కోరలేదని, ఇది సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదన చేస్తూ, ఏపీపీల పదవీకాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా రాష్ట్రం తొలగించవచ్చని చెప్పారు. తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నారు.