
- జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దని ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషికి హైకోర్టులో ఊరట లభించింది. ఘోష్ రిపోర్ట్ ఆధారంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పర్యవేక్షణలో లోపాలపై ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ జోషి వేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది. ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన దర్యాప్తును చట్టప్రకారం కొనసాగించ వచ్చని స్పష్టం చేసింది. విచారణను అక్టోబరు 7కు వాయిదా వేసింది.