స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డట్టేనా? ఎన్నికల సంఘం ఏం చేయబోతుంది..?

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డట్టేనా? ఎన్నికల సంఘం ఏం చేయబోతుంది..?
  • జీవో 9 తో లింక్ ఉన్న నోటిఫికేషన్లన్నింటికీ వర్తిస్తుందా?
  •  పాత రిజర్వేషన్ల  ప్రకారం వెళ్తే మళ్లీ నోటిఫికేషన్ మస్ట్
  • కొత్త రిజర్వేషన్ ప్రకారమైతే కోర్టు స్టే అడ్డంకి
  • కీలకంగా మారిన ఎన్నికల సంఘం డెసిషన్

హైదరాబాద్ : హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సరికొత్త చర్చకు దారి తీశాయి. బీసీలకు 42%  రిజర్వేషన్లు కేటాయిస్తూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవో  నంబర్ 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రెండు రోజుల పాటు వాదనలు విన్న హైకోర్టు తుది నిర్ణయం వెల్లడించింది. దీని ప్రకారం జీవో 9 పై స్టే విధించింది. ఇదిలా ఉండగా ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించేందుకు  ఇదివరకే షెడ్యూల్ జారీ చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 9 ప్రకారమే రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీని ఆధారంగానే 2,963 ఎంపీటీసీ, 292 జెడ్పీటీసీ స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు నామినేషన్లు సైతం దాఖలయ్యాయి.

ప్రస్తుతం ఈ జీవోపై స్టే విధించింది. దీని ప్రకారం దాఖలైన నామినేషన్ల పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. అదే విధంగా జీవో నంబర్ 9 ఆధారంగా షెడ్యూల్ ఇచ్చిన మిగతా స్థానాల పరిస్థితి ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది. పాత పద్దతి ప్రకారం ఎన్నికలకు వెళ్తే మొత్తం రిజర్వేషన్లు మారిపోతాయి. కొత్త పద్ధతికి జీవో అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది చర్చనీయాంశంగా మారింది.