
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ విధానం ఏమిటో తెలియజేయాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. వార్డుల విభజన ప్రక్రియ చట్ట వ్యతిరేకంగా ఉందంటూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సలీమ్, మరొకరు వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జీఎం. మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం1996లో జారీ చేసిన జీవో 570 ప్రకారం జనాభా ఆధారంగా వార్డుల పునర్విభజన జరగాల్సి ఉందని పిటిషనర్ తరఫు అడ్వకేట్ బర్కత్ అలీ ఖాన్ వాదించారు. ప్రస్తుతం అమలులో ఉన్న వార్డుల విభజన విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243, డీలిమిటేషన్ చట్టంలోని సెక్షన్ 8ఎఫ్ లకు వ్యతిరేకమని తెలిపారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టంలోని సెక్షన్ 6లో జనాభా స్థానంలో ఓటర్ల సంఖ్య అని ఉండటం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.
ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మున్సిపల్ చట్టాల ప్రకారం జనాభా ఆధారంగా వార్డుల పునర్విభజన జరుగుతుందన్నారు. తెలంగాణలో అందుకు వ్యతిరేకమన్నారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 వార్డులు ఉన్నాయని, వాటిలో 117 వార్డులు అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పారు. కొన్ని వార్డుల్లో 78 వేల ఓటర్లు ఉండగా, మరికొన్నింటిలో 28 వేలే ఉన్నాయన్నారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల గడువు కోరింది. అందుకు హైకోర్టు అనుమతిచ్చింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.