జహీరాబాద్‌‌ కాల్పుల కేసులో పోలీసులకు ఊరట

జహీరాబాద్‌‌ కాల్పుల కేసులో పోలీసులకు ఊరట
  •     ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు జరిపినట్లు హైకోర్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  జహీరాబాద్‌‌ కాల్పుల ఘటన(2003) ద్వారా  ఓ వ్యక్తి మరణించేందుకు కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులకు ఊరట లభించింది. విధి నిర్వహణలో ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్పులు జరిపినట్లు హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాసిక్యూషన్‌‌ చేపట్టడానికి వీల్లేదని తెలిపింది. కలెక్టర్‌‌ విచారించి సమర్పించిన నివేదిక, సీబీసీఐడీ దర్యాప్తు తుది నివేదిక, వాంగ్మూలాలు అన్నింటినీ పరిశీలించామని వివరించింది. ఈ పరీశీలన అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ పి.శ్రీధర్‌‌రెడ్డి, కానిస్టేబుల్‌‌ ఎన్‌‌.గోపాల్‌‌లపై కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. 

దొంగతనం సమాచారం మేరకు ఏసీపీ పి.శ్రీధర్‌‌రెడ్డి, కానిస్టేబుల్‌‌ ఎన్‌‌.గోపాల్‌‌ జహీరాబాద్‌‌ చేరుకున్నారు. అక్కడ ఇద్దరు దొంగలు పారిపోతుండటాన్ని చూసి పట్టుకోవడానికి ప్రయత్నించగా అందులో మహమ్మద్‌‌ షఫి అనే వ్యక్తి కానిస్టేబుల్‌‌ను పొడిచి, రైఫిల్‌‌ లాక్కుని గురిపెట్టాడు. దాంతో ఏసీపీ శ్రీధర్‌‌రెడ్డి 4 రౌండ్లు కాల్పులు జరపడంతో  మహమ్మద్‌‌ షఫి చనిపోయాడు.  బాధితలు నిరసనతో ప్రభుత్వం ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించింది. ఆత్మరక్షణలో భాగమేనని, విచారణ అవసరంలేదని నివేదిక సమర్పించింది. దీనిపై లతీఫ్‌‌ మొహమ్మద్‌‌ఖాన్‌‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేజిస్ట్రేట్‌‌ కోర్టులో పిటిషన్‌‌ వేయగా విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. విచారించిన జిల్లా కోర్టు కేసు కొనసాగించాల్సిన అవసరంలేదని తేల్చి చెప్పింది. మళ్లీ ఫిర్యాదుదారు హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్‌‌ జువ్వాడి శ్రీదేవి జిల్లా కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు వెలువరించారు.