సీజనల్ వ్యాధులతో జాగ్రత్త .. వర్షాల నేపథ్యంలో ప్రజలకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సూచనలు

సీజనల్ వ్యాధులతో జాగ్రత్త .. వర్షాల నేపథ్యంలో ప్రజలకు  డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సూచనలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరించింది. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు వర్షాకాలంలో విస్తరించే ప్రమాదం ఉందని, వీటిని నివారించేందుకు పలు సూచనలు చేసింది. డోర్లు, కిటికీలకు మస్కిటో నెట్‌‌‌‌లు బిగించడం ద్వారా దోమల వల్ల సంక్రమించే వ్యాధులను నివారించవచ్చని తెలిపింది. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’గా పాటించి నీటి నిల్వను పూర్తిగా తొలగించాలని సూచించింది. ప్రజలు ఫిల్టర్ చేసిన లేదా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. 

బయటి ఆహార పదార్థాల వినియోగాన్ని నివారించాలని, ఇవి జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయని చెప్పింది. వైరల్ జ్వరాలు, ఇన్‌‌‌‌ఫ్లుయెంజా వంటి గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు అనారోగ్యంతో బాధపడే వారికి దూరంగా ఉండాలని, షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడని సూచించింది. అవసరమైతే శానిటైజర్‌‌‌‌తో చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపింది. దగ్గు, జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌లో చేరాలని కోరింది. అత్యవసర సమయంలో 108 నంబర్‌‌‌‌కు కాల్ చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల వైద్య సదుపాయాలతో సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.