పోటీకి సిద్ధం..హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు

పోటీకి సిద్ధం..హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు  సంచలన వ్యాఖ్యలు

యుద్దం ఆరంభమైంది.. చూసుకుందాం అంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ లో జిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సరైన ప్రణాళికలు లేక అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు శ్రీనివాస్ రావు. తాము చేస్తున్న మంచి కార్యక్రమాలకు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. జెండా, ఎజెండా అనేది లేకుండా సేవలు చేస్తున్నానన్నారు. అందరి సహాయ సహకారాలతో కొత్తగూడెం బిడ్డగా ప్రాణం ఉన్నంతవరకు సేవాకార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్పారు. కొత్తగూడెం జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నా.. ప్రజాప్రతినిధులు సక్రమంగా వాటిని ఉపయోగించుకోవడం లేదన్నారు. అందుకే కొత్తగూడెం నియోజకవర్గం అంతగా అభివృద్ధి చెందలేదని ఆరోపించారు.

 

సుజాతనగర్ కొత్తగూడెం నియోజకవర్గానికి ముఖ ద్వారమని.. ప్రజల ఆశీస్సులు ఉంటేనే కొత్తగూడెం నియోజకవర్గంలో గెలుపు సాధ్యమనన్నారు శ్రీనివాస్ రావు. కొత్తగూడెం మార్పు చెందాల్సిన అవసరం ఉందని.. కొత్తగూడాన్ని మరో కొత్తగూడెంగా తీర్చిదిద్దేందుకు కొత్త నాయకత్వం అవసరమని చెప్పారు. అందరం ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. మహాభారత యుద్దానికి ముందు పాండవులు అరణ్యవాసం చేశారని..తర్వాత యుద్ధం ఆరంభమైందని.. చూసుకుందామని హెచ్చరిక జారీ చేశారు. బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ ఆదర్శప్రాయుడన్నారు. తన దృష్టిలో రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గం సిద్దిపేట అని..మంత్రి హరీష్ రావు లాంటి ఎమ్మెల్యే  తనకు ఆదర్శమని అన్నారు. అలాగే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తూ లక్షలాది ఉద్యోగాలు తీసుకు వస్తున్న కేటీఆర్ ఆదర్శప్రాయుడని తెలిపారు. తనకు జెండా ఎజెండా అంటూ ఏమీ లేదని.. మీరు ఏదంటే తాను ఆ పార్టే నని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీకి సిద్ధమేనని పరోక్షంగా వ్యాఖ్యానించారు.