- ప్రతి పౌరుడికి పైసా ఖర్చు లేకుండా వైద్య సేవలందిస్తం: దామోదర రాజనర్సింహ
- రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం చేపట్టినం
- రాష్ట్రంలో ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు
- అసెంబ్లీలో బడ్జెట్ పద్దుపై మంత్రి ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకొస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య రంగంలో రెండేండ్లలో 9,572 పోస్టులను భర్తీ చేశామని, మరో 7,267 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
మరో 2,929 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని, దీంతో మొత్తం కలిపి దాదాపు 19,768 పోస్టుల భర్తీ జరుగుతోందని వెల్లడించారు. ఆదివారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల ద్వారా లక్షలాది మంది ప్రజలకు సేవలు అందుతున్నాయని తెలిపారు.
తెలంగాణ ఆరోగ్య సూచికలు దేశ సగటుతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని, సెకండరీ హెల్త్ కేర్ సిస్టమ్‌ను పటిష్టం చేసేందుకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ను, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మారుస్తున్నామన్నారు. జిల్లాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా, జిల్లాల్లోనే 80 శాతం వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, మొత్తం 1,835 చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
నాన్ కమ్యూనికెబుల్ డిసీజ్‌ల కట్టడికి చర్యలు..
మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, తదితర కారణాలతో దేశంలో, రాష్ట్రంలో నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయని మంత్రి దామోదర తెలిపారు. బీపీ, షుగర్, కిడ్నీ, గుండె జబ్బుల వంటివి ప్రజలకు సమస్యగా మారాయన్నారు. ఈ వ్యాధుల నియంత్రణ ప్రతి జిల్లాలో ప్రత్యేక క్లినిక్స్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నామన్నారు. అలాగే, జిల్లా స్థాయిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి, కెమోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
మహిళల ఆరోగ్య రక్షణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ రెండేళ్లలో 16 డయాలిసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 102 సెంటర్ల ద్వారా సుమారు 15 వేల మంది పేషెంట్లకు సేవలు అందిస్తున్నామన్నారు. అదనంగా మరో 79 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
9 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం
మెడికల్ ఎడ్యుకేషన్ రంగంలో 9 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచినట్లు మంత్రి దామోదర తెలిపారు. రాబోయే రోజుల్లో సెకండరీ లెవల్ హాస్పిటల్స్‌లో ఐదు పీజీ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని, దీంతో జిల్లాల్లో స్పెషలిస్ట్ వైద్యుల లభ్యత పెరుగుతుందన్నారు. రెండేండ్లలో కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. సుమారు రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా టిమ్స్‌లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
నిమ్స్ తరహాలో టిమ్స్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో డయాగ్నస్టిక్ సేవలను విస్తరించి, ఆధునిక ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ సదుపాయాలను జిల్లా స్థాయికి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. మరోవైపు, 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి 35 కిలోమీటర్లకు ఒక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంబులెన్స్ సేవలను విస్తరించి 213 కొత్త వాహనాలను ప్రవేశపెట్టినట్లు మంత్రి తెలిపారు. సిటీల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి 145 పాలీక్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా ప్రతి పౌరుడికి సమగ్ర ఆరోగ్య రికార్డులు అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు.
బాల భరోసా కార్యక్రమం ద్వారా చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం మైత్రి క్లినిక్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాంధీ, పెట్లబురుజు హాస్పిటళ్లలో ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హాస్పిటళ్లను ఏర్పాటు చేస్తున్నామని, హనుమకొండలో హిమోగ్లోబినోపథీస్ (సికిల్ సెల్ అనీమియా, తలసేమియా, హిమోఫిలియా) వ్యాధులకు చికిత్స అందించేందుకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.
