బీజేపీ నేత‌లు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారు

బీజేపీ నేత‌లు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారు

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. గత కొన్ని రోజులుగా ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ.. అనేక సందర్భాల్లో చిల్లర మాటలు మాట్లాడుతోంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వానికి లేని పోనీ కట్టు కథ‌లు అల్లి ఫిర్యాదులు చేస్తోందన్నారు.

గుజరాత్‌లో కరోనా తీవ్రతకు మోడీ బాధ్యత వహిస్తారా?

శ‌నివారం జన్‌ సంవాద్ సభ(వ‌ర్చ్యువ‌ల్ ర్యాలీ)‌ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లను ఈట‌ల ఖండించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్ష హోదాలో ఉన్న జేపీ నడ్డా… కరోనా కట్టడిలో తెలంగాణ విఫలం అయింద‌ని, తెలంగాణలో మరణాలు ఎక్కువ ఉన్నాయని చిల్లర ఆరోపణలు చేశారు. ఇతరుల మీద ఆరోపణ‌లు చేసే ముందు బీజేపీ పాలిత ప్రాంతాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవాలి. గుజరాత్ లో కూడా కరోనా తో ఎంత మంది చనిపోయారు. అంటే గుజరాత్ లో ప్రభుత్వం విఫ‌లం అయిన‌ట్లా?…గుజరాత్ నుండి ఉన్న ప్రధాని బాధ్యత వహిస్తారా..? అని ప్ర‌శ్నించారు.

కంటైన్మెంట్ అనే పదానికి అర్థం చెప్పిన రాష్ట్రం తెలంగాణ

కరోనా అనేది ప్రపంచ సమస్య అని తెలిపిన ఈట‌ల‌.. కరోనా మహమ్మరి వల్ల చాలా దేశాల్లో శవాలు గుట్టలుగా పేరుకుపోయాయన్నారు. తెలంగాణ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి సీఎం కేసీఆర్ నిరంతరం మానిటర్ చేస్తున్నారని చెప్పారు. అసలు కంటైన్మెంట్ అనే పదానికి అర్థం చెప్పిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మర్కజ్ విషయం లో డీల్లీలో మీ పక్కనే సమావేశాలు జరిగితే పట్టించుకోలేదని, ఆ వ్యవహరాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి తెలిపింది కూడా తామేనని ఆయన ప్రస్తావించారు. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేశామ‌ని, కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలను పలు సంస్థలు ప్రశంసించాయన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకి అవగాహన కల్పిస్తూ సీఎం ఆదేశాలతో అధికారులు నిరంతరం పనిచేస్తున్నారని ఈట‌ల తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం

బీజేపీ అధికారం లోకి వస్తే దేశం కూడా మరో గుజరాత్ అవుతుంది అనుకున్నారు..కానీ అలా జరగలేద‌ని ఈట‌ల‌ అన్నారు . రైతులను గుర్తించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని బీజేపీ నీచ‌మైన ఆరోప‌ణ‌లు చేసింద‌ని మండిప‌డ్డ మంత్రి.. ప్రాజెక్టులు కట్టేది ప్రజల కోసమ‌ని.. కమిషన్ ల కోసం కాదని ఘాటుగా బ‌దులిచ్చారు. మీ సంస్థ ఎఫ్‌సీఐ కి అత్యధిక ధాన్యం ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ నేత న‌డ్డా నుద్దేశించి అన్నారు. ఆరోపణలు చేసే ముందు ఆలోచించి చేయాల‌ని, ఆధారాలు ఉంటే ఆరోపణలు చేయండని హెచ్చ‌రించారు. బీజేపీ నేత‌లు మతాల చుట్టు తిరుగుతారు కానీ ప్రజలు చుట్టూ తిరిగేవాళ్ళు కాదని అన్నారు. రాష్ట్రంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క సీటు గెలిచిందని.. మేం కాస్త ఆదమరిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలిచారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమ‌ని తెలిపారు ఈట‌ల‌.