పల్లె దవాఖానాల ఏర్పాటు వేగవంతం చేయాలె

పల్లె దవాఖానాల ఏర్పాటు వేగవంతం చేయాలె

ఆరోగ్య సూచీల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం ఆ దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కోఠిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కార్య్రక్రమాలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఆరోగ్య సూచీల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు పురోగతి సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  విభాగాల వారీగా అధికారులు వారి పని తీరుపై సమీక్షలు నిర్వహించుకోవాలని, ప్రతి నెల విభాగాల వారీగా తాను సమీక్ష నిర్వహిస్తానని ఆయన చెప్పారు. పని తీరులో నెలవారీ వృద్ధి కనిపించాలని, పదోన్నతులు, ప్రోత్సాహకాలకు అదే గీటు రాయి అని అన్నారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజారోగ్యానికి నిధులు ఖర్చు చేస్తోందన్నారు. రక్తహీనతను అధిగమించే విషయంలో రాష్ట్రం మరింత మెరుగైన స్థితిలో ఉండాల్సి ఉందన్నారు.

పల్లె దవాఖానాల ఏర్పాటు వేగవంతం చేయాలె

రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ పరిస్థితుల గురించి అడిగి తెల్సుకున్న మంత్రి హరీశ్ రావు, ప్రభావిత జిల్లాల పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిసరాల పరిశ్రుభ్రతను మెరుగుపరచాలని, దోమల నివారణ చర్యలు చేపట్టి.. వ్యాధుల వ్యాప్తికి చెక్ పెట్టాలని ఆదేశించారు. ప్రసూతి మరణాలు తగ్గించేందుకు కృషి చేయాలని, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు ఎక్కువయ్యేలా చూడాలని, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండు వారాల్లో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో క్యాథ్ లాబ్స్ సిద్దం కావాలన్నారు. వచ్చే నెల రెండో వారంలోగా ఖమ్మం లోని క్యాథ్ ల్యాబ్ పనులు పూర్తి చేసి, ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలన్నారు.

టీ డయాగ్నోస్టిక్ సేవలు దేశానికే ఆదర్శం

టీ డయాగ్నోస్టిక్స్ సేవలు దేశానికే ఆదర్శంగా  నిలిచాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. గత నెల బీహార్ ప్రభుత్వ అధికారులు మన రాష్ట్రాన్ని సందర్శించి టీ  డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రజలకు అందుతున్న  తీరును  పరిశీలించారర్నారు. వచ్చే వారం యూపీ నుంచి, ఆ తర్వాత కేరళ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ బృందాలను రాష్ట్రానికి పంపుతున్నాయని చెప్పారు. ఇవన్నీ మన ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న మెరుగైన సేవలకు నిదర్శనమన్నారు. ఇదే రీతిలో ఆరోగ్య సూచికల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడాలని పిలుపునిచ్చారు.