- 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌ను నియమిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. అమర్‌నాథ్ నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని స్పష్టం చేసిన కోర్టు.. అధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హెచ్‌సీఏను ఆదేశించింది.
ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యక్షుడే అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించాలని పేర్కొంది. సాగర్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ యారా రేణుక విచారణ జరిపి ఈ మేరకు తీర్పు వెలువరించారు. 2023లో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో జగన్‌మోహన్‌రావు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం అవినీతి ఆరోపణలతో ఆయన అరెస్టు కావడంతో అధ్యక్ష పదవి ఖాళీగా మారింది.
ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా నియమిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని అధ్యక్షుడిగా నియమించే అధికారం అంబుడ్స్‌మన్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పేర్కొంది. ప్రత్యామ్నాయ నియామకం ద్వారా పదవిని భర్తీ చేయడం చట్టబద్ధం కాదని తేల్చిచెప్పింది.
ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ నియామకాన్ని రద్దు చేస్తూ, అధ్యక్ష పదవికి 45 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హెచ్‌సీఏకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అసోసియేషన్ వ్యవహారాలు నిలిచిపోకుండా ఉండేందుకు ఉపాధ్యక్షుడు అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించాలని సూచించింది.
దేవరాజ్ పిటిషన్‌కు గ్రీన్‌సిగ్నల్
మరోవైపు, హెచ్‌సీఏ కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ దేవరాజ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హమేనని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
