
- సీఎస్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల డ్రాఫ్ట్‌ను రెడీ చేసి జులై 17లోగా సమర్పించాలని, లేకుంటే సీఎస్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. నిబంధనల డ్రాఫ్ట్‌పై మళ్లీ గడువు కోరడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ ఫైర్ సర్వీస్ చట్టం కింద కొత్త నిబంధనలు రూపొందించకపోవడంపై పి. గోవింద్‌తో సహా ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం 1992 నిబంధనల ప్రకారమే నియామకాలు, పదోన్నతులు జరుగుతున్నాయని, కొత్త నిబంధనలు రూపొందే వరకు నియామకాలు, పదోన్నతులను నిలిపివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. మరో నాలుగు వారాల గడువు కోరగా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అలసత్వ వైఖరిని తప్పుబట్టిన కోర్టు.. జులై 17లోగా నిబంధనలు సమర్పించాలని స్పష్టం చేసింది.