గుడుంబాపై ఉక్కు పాదం..బెల్లం దొరక్క చక్కరతో తయారీ

గుడుంబాపై ఉక్కు పాదం..బెల్లం దొరక్క చక్కరతో తయారీ
  • .వ్యాపారుల నుంచి కొనుగోలుదారుల రోజువారీ జాబితా సేకరణ
  • తయారీ కేంద్రాలపై సిబ్బందితో ఆకస్మిక దాడులు  
  • 7 నెలల్లో 3,747 కేసులు, 
  • 3,813 మంది అరెస్ట్
  • మేడారం జాతర నేపథ్యంలో మరింత ఫోకస్

వరంగల్‍, వెలుగు :  ఓరుగల్లులో గుడుంబా తయారీ అరికట్టడమే లక్ష్యంగా ఆబ్కారీ అధికారులు స్పెషల్‍ ఫోకస్‍ పెట్టారు. గతంలో తగ్గుముఖం పట్టిన గుడుంబా తయారీ కరోనా సమయంలో మళ్లీ పుంజుకోవడంతో ఎక్సైజ్‍ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. బెల్లం అమ్మకాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నారు. 

ఈ క్రమంలో బెల్లం బదులు చక్కెరతో గుడుంబా తయారీకి సిద్ధమైనవారిపై సైతం అబ్కారీ పోలీసులు కన్ను  వేశారు దీంతో సరుకు ఈజీగా దొరకని పరిస్థితి నెలకొంది. ఎంతో కష్టపడి చక్కెరతో గుడుంబా తయారు చేసినా  ఖర్చు ఎక్కువై తయారీదారులకు గిట్టుబాటు అవట్లేదు. బెల్లంతో చేసినా గుడుంబా ఇచ్చినంత కిక్ చక్కెర సరుకుతో తాగేవాళ్లు కూడా ఇష్టపడడం లేదు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా గుడుంబా తయారీకి ఫుల్‍స్టాప్‍ పెడుతున్నారు. 

ఆఫీసర్ల చేతికి.. బెల్లం వ్యాపార సమాచారం..

ఓరుగల్లు ఎక్సైజ్‍ డివిజన్ పరిధిలో వరంగల్‍ అర్బన్‍(హనుమకొండ), వరంగల్‍ రూరల్‍ (వరంగల్‍), జనగామ, మహబూబాబాద్‍, జయశంకర్‍ భూపాలపల్లి(దీని పరిధిలోనే ములుగు జిల్లా) ఉన్నాయి. వరంగల్​ అర్బన్‍, జనగామ జిల్లాలు గుడుంబా రహిత జిల్లాలుగా ఉండగా, మిగతా మూడు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో కరోనా సమయం నుంచి అడపదడపా దందా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

అయితే వీటిని సైతం గుడుంబా రహిత జిల్లాలుగా మార్చే పనిలో ఉమ్మడి వరంగల్‍ డివిజన్ ఎక్సైజ్‍శాఖ డిప్యూటీ కమిషనర్‍ అంజన్‍రావు ఉన్నారు. ఇందులో భాగంగా గతంలో గుడుంబా తయారీ, వ్యాపారాలు నిర్వహించిన వ్యక్తులతోపాటు కొత్తగా దందా మొదలుపెట్టినోళ్ల వివరాలను సేకరించి.. వారి కదలికలపై ఎప్పటికప్పుడు ఫోకస్‍ పెడుతున్నారు. 

వరంగల్‍ బీట్‍బజార్ లో బెల్లం బిజినెస్‍ వ్యాపారుల నుంచి రోజువారీగా కొనుగోలుదార్ల పేర్లు, అడ్రస్‍, ఆధార్‍ కార్డు, ఫోన్‍ నంబర్‍తో పాటు కొనుగోలు చేసిన బెల్లం విలువ వివరాలను ఆఫీసర్లు తెప్పించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాకు వచ్చిన స్టాక్‍ అమ్మకాలు సరిగా ఉన్నాయో లేవో చెక్ చేస్తున్నారు. అవసరాలకు మించి బెల్లం కొనుగోలు చేసినవారిపై వెంటనే ఆయా స్టేషన్ల సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. దీంతో గుడుంబా తయారీదారులు ఇట్టే దొరికిపోతున్నారు. 

కేసులు, అరెస్టులతో.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్రు..

ఓరుగల్లును గుడుంబా రహిత డివిజన్‍ చేయడమే లక్ష్యంగా తయారీదారుల పట్ల అబ్కారీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై 31 వరకు కేవలం 7 నెలల వ్యవధిలో 3,747 కేసులు నమోదు చేసి 3,813 మందిని అరెస్ట్ చేశారు. 

ఇందులో భూపాలపల్లి పరిధిలో 1,372, వరంగల్‍ రూరల్‍,144, మహబూబాబాద్‍ 1,014 అత్యధిక  కేసులు నమోదు కాగా.. జనగామ 153, వరంగల్‍ అర్బన్‍(హనుమకొండ) జిల్లా పరిధిలో అత్యల్పంగా 64 కేసులు నమోదు చేశారు. 7 నెలల్లో 714 వాహనాలు సీజ్‍ చేయడంతోపాటు గడిచిన మూడేళ్లలో 2,929 బైక్‍ లు, ఆటోలు, కార్లను సీజ్ చేశారు. కోర్టు ఆదేశాలతో 2,763 వాహనాలను వేలం వేయడంతో అబ్కారీ శాఖకు రూ.6.94 కోట్ల ఆదాయం వచ్చింది. 

చక్కెరతో గుడుంబా తయారీ.. నో ఫ్రాఫిట్‍..

ఎక్సైజ్ అధికారులు గుడుంబా కంట్రోల్‍ కోసం బెల్లం వ్యాపారాలపై ఫోకస్ పెట్టడంతో తయారీదారులు చక్కెర వైపు మొగ్గుచూపారు. అయితే.. 10 లీటర్ల గుడుంబా తయారీకి అవసరమయ్యే బెల్లం ఖర్చు కంటే.. చక్కెరకు ఖర్చు చాలా ఎక్కువ అవుతుండటంతో తయారీదారులు తలలు పట్టుకుంటున్నారు. 

ధర పెంచుదామంటే దాదాపు అదే ధరల్లో ప్రభుత్వమే చీప్‍ లిక్కర్‍ విక్రయిస్తుండటంతో గుడుంబా ధర పెంచలేక.. చక్కెరకు ఎక్కువ పెట్టుబడి పెట్టలేని పరిస్థితి నెలకొంది. అంతేగాక బెల్లం గుడుంబాతో పోలిస్తే.. చక్కెర గుడుంబా కిక్కు ఇవ్వట్లేదనే చెబుతుండడంతో తయారీకి వెనుకడుగు వేస్తున్నారు.  

గుడుంబా తయారీ బంద్‍ చేయాల్సిందే

గుడుంబా రహిత ఓరుగల్లే లక్ష్యంగా ఉమ్మడి వరంగల్‍ డివిజన్ పరిధిలో గుడుంబా తయారీ, విక్రయాలు ఆపేలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. మేడారం జాతరలో నుంచి వచ్చే బెల్లాన్ని గతంలో కొందరు అక్రమంగా గుడుంబా తయారీకి వినియోగించారు. దీంతో జాతర టైంలో ఇక్కడి బెల్లాన్ని వేలం పాటలో అమ్మకాలు చేసి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నాం. 

మన వద్దకు వచ్చే స్టాక్ ఆధారంగా వ్యాపారుల నుంచి ప్రతిరోజు బెల్లం, చక్కెర కొనుగోలుదారుల ఆధార్‍ కార్డుతో సహా పూర్తి వివరాలు తెప్పిస్తున్నాం. దందా ఆపనివారిపై తీవ్రత ఆధారంగా పీడీ యాక్టుల వరకు కేసులు నమోదు చేస్తున్నాం. - జి.అంజన్‍రావు (డిప్యూటీ కమిషనర్‍, వరంగల్‍ డివిజన్‍)