
- ఇనాం భూములపై రైతుకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు రూ. 40 వేలు డిమాండ్
కొత్తకోట, వెలుగు : ఇనాం భూముల విషయంలో రైతుకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన వనపర్తి జిల్లా కొత్తకోట ఆర్‌ఐ, డిప్యూటీ సర్వేయర్‌ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కొత్తకోట మండలంలోని నిర్వీణ్ గ్రామానికి చెందిన ఓ రైతు ఇనాం భూముల ఓఆర్‌సీ కోసం ఆర్డీవోకు అప్లికేషన్ పెట్టుకున్నాడు.
భూములకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డీవో కొత్తకోట తహసీల్దార్‌కు సూచించగా.. ఆయన ఆర్‌ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆర్‌ఐ, డిప్యూటీ సర్వేయర్ కలిసి రైతుకు ఫోన్ చేసి రూ. 40 వేలు ఇస్తే అనుకూలంగా రిపోర్ట్ ఇస్తామని చెప్పారు.
అంత ఇచ్చుకోలేనని రైతు చెప్పినా వినకుండా.. డబ్బులు ఇస్తేనే రిపోర్ట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఆఫీసర్లు మాట్లాడిన ఆడియోను రికార్డు చేసిన రైతు ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆడియో క్లిప్ ఆధారంగా పూర్తి వివరాలు సేకరించిన ఏసీబీ ఆఫీసర్లు గురువారం తహసీల్దార్ ఆఫీస్‌లో తనిఖీలు చేపట్టి ఆర్‌ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.