శంషాబాద్ మున్సిపల్ ఆఫీసర్లపై హైకోర్టు ఫైర్

శంషాబాద్ మున్సిపల్ ఆఫీసర్లపై హైకోర్టు ఫైర్

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నదని ప్రజలు వినతిపత్రాలు ఇచ్చినా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శంషాబాద్‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. విధులు నిర్వహించకుండా నిద్రపోతున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆఫీసర్లు సరిగ్గా స్పందిస్తే కోర్టుల్లో కేసులు పేరుకుపోవని అభిప్రాయపడింది. చట్ట ప్రకారం డ్యూటీ చేయకపోతే అధికారులు ఉండి ఎందుకని, చట్టబద్ధమైన విధులు నిర్వహించనపుడు మున్సిపాలిటీ దేనికోసమని ఫైర్​అయింది. 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌‌‌ మండలం సంగిగూడ గ్రామంలో సర్వే నెంబర్​ 117/2వ, 117/2ఎఎ, 117/2ఇ, 117/2ఇఇల్లో మొత్తం 438 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదంటూ బి. మల్లేశ్​యాదవ్‌‌‌‌ హైకోర్టులో పిల్‌‌‌‌ దాఖలు చేశారు. 

దీనిని చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ టీ వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌లతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ శుక్రవారం విచారించింది. పిటిషనర్‌‌‌‌ తరఫు లాయర్‌‌‌‌ వాదిస్తూ.. మహ్మద్‌‌‌‌ ఫరీద్‌‌‌‌ ఉద్దీన్‌‌‌‌ ఆజ్మీ, కేఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ ఎకో కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌ ఆ భూమిలో రోడ్లు వేస్తున్నారని చెప్పారు. ప్లాట్లుగా చేసి అమ్మకాలు జరిపే పనిలో ఉన్నారని తెలిపారు. ఈ భూ కబ్జాపై మున్సిపల్​అధికారులకు రెండుసార్లు వినతిపత్రాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. సీసీఎల్‌‌‌‌ఏ మార్చి 24న శంషాబాద్‌‌‌‌ మున్సిపాలిటీ, చిన్న గోల్కొండ పంచాయతీలకు లేఖ రాసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.

 అయితే, ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నందున అవి రిజిస్ట్రేషన్‌‌‌‌ జరగవని ప్రభుత్వ ప్లీడర్‌‌‌‌ శ్రీకాంత్‌‌‌‌రెడ్డి చెప్పారు. వాదనల తర్వాత సీసీఎల్‌‌‌‌ఏ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నది వివరించాలని శంషాబాద్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ అధికారులను హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.