హైకోర్టు ఫైర్: రేపటి వరకు ఎంతమంది చనిపోవాలి?

హైకోర్టు ఫైర్: రేపటి వరకు ఎంతమంది చనిపోవాలి?

తెలంగాణలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో లాక్‌డౌన్ మీద ఏదో ఒక నిర్ణయం చెప్పాలని హైకోర్టు ప్రభుత్వానికి గడువు విధించింది. దానిప్రకారం రాష్ట్రంలో రేపటినుంచి అంటే మే 12 నుంచి మే 22 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ తెలిపారు. పక్కరాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్స్‌లను సరిహద్దులో ఆపడాన్ని కోర్టు తీవ్రంగా తప్పబట్టింది. ఆ విషయంలో కూడా ఏదో ఒక నిర్ణయం తెలపాలని సూచించింది. అందుకు ఏజీ.. రేపటిలోగా అంబులెన్స్‌ల రాకపై నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఈ సమాధానంపై కోర్టు మండిపడింది. మీరు నిర్ణయం తీసుకునేలోపు ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి? అని కోర్టు ప్రశ్నించింది.

హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఉంది. ఇక్కడికి చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వైద్యం కోసం చాలామంది వస్తున్నారు. ప్రతిరోజూ వివిధ రాష్ట్రాల నుంచి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో ఎంతోమంది రోగులు వస్తున్నారు. అటువంటిది మీరు సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎలా ఆపుతారు? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్‌లను నిలిపి వేసి ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సరిహద్దుల వద్ద ఎటువంటి అంబులెన్స్‌లను ఆపకూడదని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

అదేవిధంగా లాక్‌డౌన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంత సడెన్‌గా లాక్‌డౌన్ విధిస్తే ఇతర రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఏంటని కోర్టు మండిపడింది. కనీసం వీకెండ్ లాక్‌డౌన్ ఆలోచన కూడా చేయకుండా.. సడెన్ నిర్ణయం ఏంటని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇలా అయితే ఇతర ప్రాంతాల వాళ్లు స్వస్థలాలకు ఎలా వెళ్తారని ప్రశ్నించింది. పోయిన ఏడాది వలస కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని కోర్టు తెలిపింది. ఆరు గంటల్లో వలస కార్మికుల కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇతర ప్రాంతాల్లో సంపూర్ణ లాక్ డౌన్ మంచి ఫలితాలనిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. దీనికి సమాధానంగా వలసకార్మికుల కోసం, ఇతర ప్రాంతాల వారికోసం ఎమర్జెన్సీ పాస్‌లను ఇస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. సడెన్ లాక్‌డౌన్‌తో ప్రజల్లో రెండో డోస్ వ్యాక్సిన్‌పై అయోమయం ఏర్పడింది. దాని గురించి ప్రభుత్వం ఏం ఆలోచించిందని కోర్టు అడిగింది. ప్రజల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ యదావిధిగా కొనసాగించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.